గత మూడు ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ హ్యాట్రిక్ కొట్టిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి..ఈ సారి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలేలా ఉందని పలు సర్వేలు వస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ పరంగా కాస్త వైవిధ్యమైన ఫలితాలు వచ్చే ఇబ్రహీంపట్నంలో గత మూడు ఎన్నికల్లో మంచిరెడ్డి గెలుస్తూ వచ్చారు. 2009, 2014 ఎన్నికల్లో ఆయన టిడిపి నుంచి గెలిచారు. ఇక 2018 ఎన్నికల్లో ఓటమి దగ్గరకొచ్చి మరీ గెలుపుని దక్కించుకున్నారు. కేవలం 375 ఓట్ల తేడాతో బిఎస్పి నుంచి పోటీ చేసిన మల్‌రెడ్డి రంగారెడ్డిపై గెలిచారు.
అయితే ఇలా తక్కువ ఓట్లతో గెలిచిన మంచిరెడ్డికి ప్రస్తుతం అక్కడ పరిస్తితులు అంతగా అనుకూలంగా కనిపించడం లేదు. ఆయనపై ఇప్పటికే ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ వ్యతిరేకత గత ఎన్నికల్లో కూడా ఉంది గాని…కేసిఆర్ గాలి, టిడిపి ఓట్లు చీల్చడం వల్ల మంచిరెడ్డి గెలిచేశారు. కానీ ఈ సారి ఎలాగైనా మంచిరెడ్డిని ఓడించాలని మల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. 1994లో మలక్‌పేట నుంచి టిడిపి తరుపున గెలిచిన రంగారెడ్డి..2004లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇక 2009లో ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయారు.
అటు 2014లో మహేశ్వరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ..ఇబ్రహీంపట్నం సీటు టిడిపికి ఇచ్చింది. దీంతో రంగారెడ్డి బిఎస్‌పి నుంచి పోటీ చేసి మంచిరెడ్డికి గట్టి పోటీ ఇచ్చి 375 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఈ సారి మాత్రం రంగారెడ్డి…మంచిరెడ్డికి చెక్ పెట్టేలా ఉన్నారు. అయితే ఈ సారి ఇక్కడ బిజేపి కాస్త ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. గెలిచే ఛాన్స్ లేదు గాని…ఓట్లు చీల్చవచ్చు. మరి ఈ సారి ఇబ్రహీంపట్నంలో ఎవరు గెలుస్తారో చూడాలి.