తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లొల్లి ఆగడం లేదు…ఆ పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దిగ్విజయ్ సింగ్ వచ్చి..పరిస్తితులని చక్కదిద్దాడానికి చూశారు..అలాగే అందరు నేతల సమస్యలు తెలుసుకున్నారు..ఈ అంశాలని అధిష్టానానికి వివరిస్తానని చెప్పారు. అయితే దిగ్విజయ్ రాక వల్ల కాస్త బయటకు వచ్చి విమర్శలు చేసుకోవడం ఆపారు గాని…అంటర్గతంగా మాత్రం రచ్చ నడుస్తూనే ఉందని తెలుస్తోంది. సీనియర్లు వర్సెస్ రేవంత్ వర్గం అన్నట్లు పోరు జరుగుతోంది.
ఇప్పటికే పదవుల పంపకాల్లో రచ్చ నడవటం, టీడీపీ నుంచి వచ్చిన వారికే పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చారని ఉత్తమ్, భట్టి లాంటి వారు విమర్శలు చేయడం, దానికి కౌంటరుగా టీడీపీ నుంచి వచ్చిన వారు పదవులకు రాజీనామాలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే దిగ్విజయ్ వచ్చి..సమస్యలని పరిష్కరించడానికి చూశారు. ఇక ఆయన వెళ్ళిన వెంటనే..మళ్ళీ రచ్చ మొదలైంది. తాజాగా రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
తన వర్గంతో కలిసి తెలంగాణ సామాజిక కాంగ్రెస్ అనే పార్టీ పెడతారని పోస్టులు పెట్టారు. ఇక దీనిపై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకర్ అనే వ్యక్తి ఈ పోస్టులు పెట్టినట్లు తెలిసింది. అయితే ఉద్దేశపూర్వకంగానే రేవంత్ రెడ్డిపై ఓ వర్గం తప్పుడు ప్రచారం చేస్తుందని రేవంత్ అనుచరులు ఫైర్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే ఆ మధ్య కొందరు సీనియర్ నేతలు..కేసీఆర్‌కు కోవర్టులుగా పనిచేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. ఇదంతా రేవంత్ వర్గమే చేయిస్తుందని సీనియర్లు మండిపడ్డారు. ఇప్పుడు రేవంత్ కొత్త పార్టీ పెట్టడం అనేది కూడా ఎవరో కుట్ర పన్ని ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ లో లొల్లి ఆగేలా లేదు.