తెలంగాణ కాంగ్రెస్ – ఏపీ కాంగ్రెస్ నేర్పే రాజ‌కీయ నీతి ఒక్క‌టే ?

అవును! ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్న విశ్లేష‌కులు.. ఏపీ కాంగ్రెస్ నేత‌లు మేల్కొన‌క‌పోతే.. ఇక అంతే సంగ‌తులు అని తేల్చి చెబుతున్నారు. తెలంగాణ‌ను ఇచ్చింది తామేన‌ని చెప్పుకొనే తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు.. ఎక్క‌డిక ‌క్క‌డ చ‌తికిల ప‌డుతున్నారు. ఇప్ప‌టికి రెండు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. రెండు సార్లు గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌రిగాయి. మ‌రి తెలంగా ణ సాధించిన పార్టీతో పోల్చితే.. తెలంగాణ ఇచ్చామ‌ని చెబుతున్న పార్టీ దూకుడు మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా నానాటి కీ తీసిక‌ట్టుగా మారిపోయింది. కీల‌క‌మైన రేవంత్ రెడ్డి వంటి నాయ‌కులు ఉండి కూడా పార్టీ పుంజుకోక‌పోగా.. గ‌త 2016 ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ లో సాధించిన సీట్ల‌ను కూడా చేజార్చుకుంది.

దీనికి కార‌ణాలు ఏంటి..? ఎందుకు సంపూర్ణంగా చ‌తికిల ప‌డింది? అని ఆరాతీస్తే.. ప్ర‌ధానంగా నేత‌ల మ‌ధ్య‌క‌లివిడి లేక‌పోవ‌డం, మూస‌విధానాల అనుస‌రణ‌, పార్టీ చీఫ్‌పై న‌మ్మ‌కం క‌లిగించ‌డంలోనూ వైఫ‌ల్యం, అన్నింటికీ మించి.. పార్టీ అధికారంలోకి వ‌స్తుంద నే న‌మ్మ‌కం ఇటు నాయ‌కుల్లోనూ అటు ప్ర‌జ‌ల్లోనూ క‌ల్పించ‌డంలో కాంగ్రెస్ నాయ‌కులు పూర్తిగా చేతులు ఎత్తేయ‌డం.. కొంద‌రు అధికార పార్టీలో చేరిపోవ‌డం వంటి ప‌రిణామాలు కాంగ్రెస్ పార్టీని శ‌రాఘాతంగా తాకి.. ఇప్పుడు ఏకంగా అడ్ర‌స్‌నే గ‌ల్లంతు చేశా య‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. దీనికి భిన్నంగా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అంతేకాదు.. నాయ‌కుల లేమి.. కొర‌గాని కార్యాచ‌ర‌ణ‌లు.. అందివ‌చ్చిన అమ‌రావ‌తి, పోల‌వ‌రం వంటి ప‌థ‌కాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోలేక పోవ‌డం, ప్ర‌బుత్వ విధానాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంలోను, ప్ర‌జ‌ల‌కు పార్టీని చేరువ చేయ‌డంలోనూ పార్టీ నాయ‌కులు అడుగ‌డుగునా విఫ‌లం కావ‌డం వంటి ప‌రిణామాలు.. ఏపీ కాంగ్రెస్‌ను సంపూర్ణంగా దెబ్బ‌కొట్టేశాయి. ఇప్ప‌టికీ.. ముంద‌స్తు వ్యూహం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

పైగా.. పార్టీని అధికారంలోకి తీసుకువ‌స్తామ‌ని.. చెబుతున్న కాంగ్రెస్ నాయ‌కులు క‌లివిడి ర‌హిత రాజ‌కీయాల‌కే ప్రాధాన్యం ఇవ్వ‌డం.. కొత్త స‌భ్య‌త్వాల జోలికి పోక‌పోవ‌డం.. ప్ర‌జ‌ల్లో ఉన్న శూన్య‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు కూడా చేయ‌లేక పోవ‌డం వంటివి ఏపీ కాంగ్రెస్‌కు అశ‌నిపాతాలుగా మారాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తంగా చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని ద‌శాబ్దాల పాటు.. కాంగ్రెస్ ఏలిన రాజ్యం.. క‌నుమ‌రుగు అయిపోవ‌డం కాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు