రాష్ట్ర‌ప‌తి : హ‌మ్మ‌య్య జ‌గ‌న‌న్న సేఫ్ !

-

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లకు సంబంధించి అభ్యర్థిత్వం ఖ‌రారులో మొద‌టి నుంచి ఊగిస‌లాడే కొన‌సాగుతోంది. మొదట వినిపించిన పేర్లు ఆఖరిదాకా లేకుండా పోయాయి. ఆఖ‌రికి మొన్న‌టిదాకా స్వ‌ప‌క్ష‌, విప‌క్ష అభ్య‌ర్థిత్వాల ఖ‌రారులో పెద్ద డైల‌మానే నెల‌కొంది. ఇప్పుడు ఎన్డీఏ త‌ర‌ఫున ద్రౌప‌దీ ముర్మూ బ‌రిలో ఉన్నారు. అదేవిధంగా విప‌క్ష పార్టీల అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా ఉంటార‌ని తేలిపోయింది. ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఊహాగానాలే వ‌చ్చాయి. వెంక‌య్య నాయుడినే రాష్ట్ర‌ప‌తిగా నియ‌మిస్తారు అన్న వాద‌న కూడా వ‌చ్చింది. ఆయ‌నైతే ఎన్నిక కూడా  ఏక‌గ్రీవం అవుతుంద‌న్న  ఊహాగానాలే వ‌చ్చాయి. ఆఖ‌రికి అది అబ‌ద్ధం అని తేల‌డానికి రాత్రి తొమ్మిదిన్న‌ర గంట‌ల సమ‌యం దాటాల్సి వ‌చ్చింది.  ఈ క్ర‌మంలోనే తెలుగు రాష్ట్రాల‌లో విపరీతం అయిన చ‌ర్చ అయితే నెల‌కొంది. వెంక‌య్య నాయుడు అయితే సమ‌ర్థుడు అని టీడీపీ మీడియా డ‌ప్పు కొట్టింది. దీంతో  అంతా అటువైపు ఆలోచించ‌డం ప్రారంభించారు.

ఈ నేప‌థ్యంలో జగ‌న్ వ‌ర్గాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితంగా మెలిగే వ్య‌క్తిగా పేరున్న వెంక‌య్య‌నాయుడికి మ‌ద్ద‌తు ఇవ్వాలా వ‌ద్దా లేదా రాష్ట్రప‌తి ఎన్నిక‌ల నుంచి క్విట్ అయిపోవాలా అన్న  చ‌ర్చ‌లూ న‌డిచాయి. లేదా త‌ట‌స్థంగా ఉండిపోవాలా ? అన్న ప్ర‌శ్న కూడా వ‌చ్చింది. వెంకయ్య నాయుడు అయితే త‌మ‌కు అనుకూలం కాని వ్య‌క్తి అని, అలాంట‌ప్పుడు ఆయ‌న‌కు ఎలా మ‌ద్ద‌తు ఇస్తామని  కూడా ఓ వాద‌న వినిపించింది. గ‌తంలో కూడా ఆయ‌న ఫక్తు టీడీపీ మ‌నిషిగానే వ్యవ‌హ‌రించార‌ని, ఇప్పుడు బీజేపీలో చేరిన టీడీపీ నాయ‌కుల‌కూ ఆయ‌నే దిశా నిర్దేశం చేస్తున్నార‌ని వైసీపీ వ‌ర్గాలు ఆరోపిస్తూ వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలో ఆయ‌న కనుక రాష్ట్ర‌ప‌తి అయితే త‌మ‌కు ఇబ్బందేన‌ని చాలా మంది వైసీపీ సోష‌ల్ మీడియా  యాక్టివిస్టులు అభిప్రాయ‌ప‌డ్డారు. చివ‌ర‌కు ఎన్డీఏ అభ్య‌ర్థి ఎవ‌రు అన్న‌ది తేలిపోవ‌డంతో వైసీపీ ఊపిరిపీల్చుకుంది. ఈ ఎన్నిక‌ల్లో ఎలానూ బీజేపీకే స‌హ‌కరించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు క‌నుక దానిని కూడా ముందున్న కాలంలో రాజ‌కీయంగా ఏ విధంగా మ‌లుచుకోవాలో అన్న ఆలోచ‌న‌లో ఉన్నార‌ని టీడీపీ విమ‌ర్శ‌లు చేస్తోంది. ఓ విధంగా వెంక‌య్య‌కు రాష్ట్ర ప‌తి ప‌ద‌వి లేకున్నా, ఢిల్లీ లాబీయింగ్ లో ఎప్ప‌టికీ టీడీపీకే ఆయ‌న సహరిస్తార‌ని వైసీపీ అంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news