ఎన్నికల ప్రచారంలో జగన్‌తోపాటు ఆయన చెల్లెలు షర్మిళ కూడా పాల్గొంటారని తెలిసింది. ఎన్నికల ప్రచారానికి గడువు చాలా తక్కువగా ఉండడంతో జగన్ అన్ని చోట్లా ప్రచారం చేయలేరని తెలిసింది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు మరోవైపు లోక్‌సభ ఎన్నికలు కూడా దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలన్నీ వీలైనంత త్వరగా అభ్యర్థులను ఎంపిక చేసి ప్రచారం మొదలు పెట్టాలని చూస్తున్నాయి. అందులో భాగంగానే పార్టీలన్నీ ఏపీలోని అసెంబ్లీ స్థానాలతోపాటు అటు లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక వైకాపా అధినేత జగన్ కూడా వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితాలను విడుదల చేసి ప్రచారంలో ముందుకు దూసుకుపోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 16వ తేదీ నుంచి జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
అయితే ఎన్నికల ప్రచారంలో జగన్‌తోపాటు ఆయన చెల్లెలు షర్మిళ కూడా పాల్గొంటారని తెలిసింది. ఎన్నికల ప్రచారానికి గడువు చాలా తక్కువగా ఉండడంతో జగన్ అన్ని చోట్లా ప్రచారం చేయలేరని తెలిసింది. దీంతో జగన్ ప్రచారం చేయలేని చోట ఆయన చెల్లెలు షర్మిళతో ప్రచారం చేయిస్తారని కూడా సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే షర్మిళతోపాటు వైఎస్ విజయమ్మ కూడా ప్రచారంలో పాల్గొంటారని తెలిసింది.
ఇక జగన్ ఈసారి కోస్తా జిల్లాలపై దృష్టా సారిస్తారని, ఆ జిల్లాల్లోనే ఎక్కువగా ప్రచారం చేస్తారని తెలుస్తున్నందున.. అటు రాయలసీమలో షర్మిళ ప్రచారం చేస్తారని తెలిసింది. కాగా గతంలో జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిళే పార్టీని ముందుండి నడిపించారు. అలాగే గత ఎన్నికల్లోనూ తనదైన శైలిలో ప్రసంగాలు ఇస్తూ ఆమె ఓటర్లను ఆకట్టుకున్నారు. దీంతో మరోసారి ఆమెతో ప్రచారం చేయించాలని వైసీపీ భావిస్తున్నదట. ఈ క్రమంలో జగన్ ప్రచారం ప్రారంభించాక షర్మిళ కూడా అందులో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే షర్మిళ ప్రచారం చేస్తే తమ పార్టీకి కూడా బాగా కలసి వస్తుందని వైకాపా నేతలు భావిస్తున్నారు. మరి ఆమె ప్రచారం ఈ సారి ఎలా ఉండబోతుందో, అధికార పార్టీ టీడీపీకి ఆమె ఎలాంటి కౌంటర్లు ఇస్తారో.. వేచి చూస్తే తెలుస్తుంది..!