ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపిల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధంలో జనసేన కాస్త వెనుకబడిందనే చెప్పాలి. ఏదో పవన్ కల్యాణ్ రాష్ట్రానికి వచ్చి ఏదైనా అంశంపై పోరాటం చేసినప్పుడే..జనసేన శ్రేణులు యాక్టివ్ గా ఉంటున్నాయి. మిగిలిన సమయంలో వారు అంత యాక్టివ్ గా ఉండటం లేదు. ఇటు పవన్ సైతం అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాలు చేయడం ఇబ్బందిగా మారింది.
ఓ వైపు టిడిపిలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు..అటు చంద్రబాబు రోడ్ షోలతో జనంలో ఉంటున్నారు. ఈ పరిణామాలతో టిడిపి పుంజుకుంటుంది. కానీ జనసేన బలోపేతానికి పవన్ పెద్దగా ఎఫర్ట్ పెట్టినట్లు కనిపించడం లేదు. పైగా వారాహితో బస్సు యాత్ర అన్నారు..మరి అది అప్పుడు నడుస్తుందో క్లారిటీ రావడం లేదు. బస్సు యాత్ర మొదలుపెడితేనే జనసేనకు మైలేజ్ వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా కాపుసేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య..ఊహించని విధంగా బస్సు యాత్ర చేస్తే జనసేన బలం ఏ మాత్రం పెరుగుతుందనే అంశంపై ఓ సర్వే విడుదల చేశారు.
బస్సు యాత్రకు ముందు చూస్తే..175 సీట్లలో వైసీపీకి 95, టీడీపీకి 65, జనసేనకు 15 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అదే బస్సు యాత్ర తర్వాత సీన్ మారుతుందని..జనసేనకు 40 సీట్లు, టిడిపికి 55 సీట్లు, వైసీపీకి 80 సీట్లు వస్తాయని జోగయ్య జోస్యం చెప్పారు. అయితే జోస్యం నిజమయ్యే అవకాశాలు లేవు. కానీ పవన్ బస్సు యాత్ర చేస్తే మాత్రం జనసేన బలం పెరగడం ఖాయమని చెప్పవచ్చు.