నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనేది సత్యవాక్కు. ఎక్కడబడితే అక్కడ ఎలా బడితే అలా మాట్లాడకూడదు అనేది ఈ నానుడికి అర్ధం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఈ వాక్యం సరిగ్గా సరిపోతుందనే చెప్పాలి. వారాహి యాత్ర చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చాలా వరకు వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన పవన్ మరో అడుగు ముందుకేసి వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేశారు. తన నోటిదురుసు వలన జనసేన స్థాయిని స్వయంగా పాతాళానికి తొక్కేశారు పవన్. చిరాకులతో ఏదిపడితే అది మాట్లాడతారా అంటూ రాష్ర్టవ్యాప్తంగా వాలంటీర్లు నిరసనలకు దిగారు. ముప్పేట దాడి ప్రారంభించిన వాలంటీర్లు పవన్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
వ్యక్తులమీద కామెంట్లు చేసినంత ఈజీగా వ్యవస్థలమీద నోరు పారేసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు పవన్‌కి అర్థమైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షలమంది సైన్యంతో బలమైనదిగా ఉన్న వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తూ వారిని హ్యూమన్ ట్రాఫికర్స్ అంటూ అవమానకరంగా మాట్లాడినందుకు పవన్ గట్టి మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది.పవన్ చేసిన ఈ నోటి దురుసు కామెంట్లు ప్రజల్లో అయన స్థాయిని పాతాళానికి తీసుకెళ్లాయి. ఇక ఇటు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వాలంటీర్లు, వారి కుటుంబీకులు సైతం పవన్ నోటి దురదను గట్టిగా వ్యతిరేకిస్తూ ధర్నాలు, దిష్టిబొమ్మల దగ్ధం వంటి నిరసనలతో రాష్ట్రాన్ని హోరెత్తిస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు సైతం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవస్థతో పవన్ కోరి కోరి కొరివితో తలగోక్కున్నట్లు అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్, వరదలు వంటి కష్టకాలంలో వాలంటీర్ల సేవలు నిరుపమానం. కోవిడ్ మృతులను చూసేందుకు సైతం బంధుమిత్రులు.. ఆఖరుకు.. కన్నవాళ్ళు.. కట్టుకునేవాళ్ళు రాలేక భయానక వాతావరణం నెలకొన్న రోజుల్లో.. వారి శవాలను తీసుకెళ్లి కర్మకాండలు జరిపించిన సేవకులు వీళ్ళు. గోదావరి జిల్లాల్లో వరదలు ముంచెత్తి ఊర్లకు ఊర్లు మునిగిపోయి బిక్కుబిక్కుమంటున్న టైమ్‌లో పీకల్లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి సరుకులు ఇచ్చి మేమున్నాంటూ భరోసా ఇచ్చి ఆత్మీయ బంధువుల్లా వ్యవహరించారు. అలాంటి వారిమీద నోటిదూలకొద్దీ మాట్లాడి తన ఆజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు జనసేనాని. గ్రామాల్లో వృద్ధులు.. బాలింతలు.. ఇతర అభాగ్యులకు సొంత మనుషుల్లా సేవలు అందించే ఓ పెద్ద వ్యవస్థను కావాలని తనకు వ్యతిరేకంగా మార్చుకున్న పవన్ ఇప్పుడు తన మాటలకు క్షమాపణ చెప్పలేక, కొత్త భాష్యం అందుకున్నారు.
వాలంటీర్లు అందరూ కాకున్నా కొందరు చెడ్డవాళ్లని కొత్త పల్లవి పాడుతున్నారు. ప్రస్తుతం తాను పర్యటిస్తున్న గోదావరి జిల్లాలో అయన సామాజికవర్గానికి చెందిన కాపు యువత ఎంతోమంది వాలంటీర్లుగా ఉన్నారు. మరి ఈయన నోటిదురుసు ప్రకటనతో వారి మనోభావాలు దెబ్బతినవా ? ఏమిటో ఈ బుర్రతక్కువ మాటలు. పదేనేళ్ళుగా రాజకీయాల్లో ఉన్న పవన్ ఏదో ఒకరోజు మంచి నాయకుడు అవుతాడు అనుకుంటే ఇలా పరువుతీసుకుని తన ప్రతిష్టను తానే దిగజార్చుకుని విమర్శల పాలవుతారని అనుకోలేదు. పాపం. . . .పవన్. . . ఇకపై ఇంకెంత స్థాయికి దిగజారుతాడో చూడాలి