కడియం శ్రీహరి.. ఒకప్పుడు వరంగల్ లో కీలక నేత. టీఆర్ ఎస్‌ను 2014లో వరంగల్ జరిగిన అన్ని ఎలక్షన్లలో గెలిపించిన వ్యూహ కర్త. ఒకానొక టైమ్ లో జగదీశ్ రెడ్డిని కూడా కాదని కేసీఆర్ కడియంకే ఎక్కువ బాధ్యతలు అప్పజెప్పిన రోజులు ఉన్నాయి. వరంగల్ లో కడియం శ్రీహరి లేనిదే టీఆర్ ఎస్ రాజకీయాలు లేవనేంతగా ఆయన ప్రభావం చూపించారు. వరంగల్ ఎంపీ బైపోల్ ఎలక్షన్స్ లో కూడా పసునూరి దయాకర్ ను దగ్గరుండి గెలిపించిన చాణక్యుడు. అంతేకాదండోయ్.. కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉండి డిప్యూటీ సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రంలో చక్రం తిప్పిన నేత. మరీ ముఖ్యంగా కేసీఆర్ ను ఎవరైనా ఏమైనా అంటే ఏకిపారేసే వారిలో ముందుండేవాడు.
ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. దీనికి కారణం 2018లో స్టేషన్ ఘన్ పూర్ నుంచి టికెట్ దక్కకపోవడం. రిజర్వేషన్ కోటాలో తనకే టికెట్ వస్తుందని భావించినా.. తన సామాజిక వర్గానికి చెందిన రాజయ్యకు దక్కింది. అప్పట్లో రాజయ్య వచ్చి తనను టార్గెట్ చేయవద్దంటూ శ్రీహరి కాళ్లు కూడా మొక్కాడు. ఇది అప్పట్లో పెద్ద సంచనంగా మారింది. ఇక ఎమ్మెల్సీ తరఫున కడియంను మళ్లీ మంత్రి పదవిలోకి తీసుకుంటారని వార్తలు వచ్చినా.. ఈ సారి వరంగల్ నుంచి టీడీపీ నుంచి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఇచ్చారు.
దీంతో ఎర్రబెల్లి వర్గీయులు కడియం ప్రాభవాన్ని తగ్గించారనే చెప్పాలి. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా మొత్తం తానై నడిపించిన కడియంను ఇప్పుడు కనీసం పార్టీ మీటింగులకు కూడా పిలవట్లేదు. అన్ని ఎన్నికల్లోనూ ఎర్రబెల్లి తన వర్గీయులకే టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకున్నారు. అయితే వరంగల్ లో టీఆర్ ఎస్ ను బలోపేతం చేసిన తనను కేసీఆర్ పట్టించుకోవట్లేదనే అసహనంలో కడియం ఉన్నారని తెలుస్తోంది. ఏ ఎన్నికల్లోనూ కడియంకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వట్లేదనేది కాదనలేని నిజం. దీంతో శ్రీహరి కూడా పెద్దగా మీడియా ముందుకు రావట్లేదు. పార్టీ మీటింగులకు కూడా హాజరవ్వట్లేదు.
ఇక తాజాగా జరుగుతున్న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఎక్కడా కడియం పేరు వినిపించట్లేదు. హవా అంతా ఎర్రబెల్లిదే. ఏం మాట్లాడినా ఆయనే. పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా అది దయాకర్ రావుదే అవుతోంది. ఒకప్పుడు పార్టీలోనే లేని ఎర్రబెల్లికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణం ఎర్రబెల్లి కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వాడని కడియం అనుచరులు వాపోతున్నారు. ఇక తాము చేసేది లేక.. తన పరిధిలోని పనులే చూసుకుంటున్నారు శ్రీహరి. అయితే ఈ మధ్య స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే అయిన రాజయ్యపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ఏ మాత్రం అభివృద్ధి చేయట్లేదంటూ ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. అయితే సొంత పార్టీ నేతపై విమర్శలు చేస్తున్నారని రాజయ్య ఇప్పటికే కేటీఆర్ కు కంప్లైంట్ కూడా చేశారట. దీనిపై మంత్రి కేటీఆర్ కూడా శ్రీహరికి క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారుతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి కడియం అడుగులు ఎటువైపు ఉంటాయో చూడాలి.