అరవింద్‌పై పోటీ.. కవిత క్లారిటీ.. మరో సీటుపై ఫోకస్.!

ఇంతకాలం సైలెంట్‌గా ఉంటూ వచ్చిన కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..ఇటీవల జరిగిన సి‌బి‌ఐ విచారణ తర్వాత దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు రావడం, ఈడీ రిమాండ్‌లో కవిత పేరు నమోదు కావడంతో..ఆ మధ్య సి‌బి‌ఐ కవితని విచారించడానికి నోటీసులు జారీ చేసి..తాజాగా లిక్కర్ స్కామ్‌కు సంబంధించి అంశాలపై విచారణ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ విచారణ తర్వాత వెంటనే కేసీఆర్‌ని కలిసిన కవిత..ఆ తర్వాత నుంచి బీజేపీ టార్గెట్ గా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. వారు విమర్శలు చేస్తే వెంటనే కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా బండి సంజయ్..తెలంగాణ జాగృతిపై విమర్శలు చేశారు. దీంతో బండికి వెంటనే కవిత కౌంటర్ ఇచ్చారు.  బతుకమ్మ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, జాగృతి ఎప్పుడూ సైలెంట్‌గా లేదని.. సమయాన్ని బట్టి తమ పంథాను మార్చుకుంటూ వచ్చామన్నారు.

అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే సీటుపై కవిత క్లారిటీ ఇచ్చారు. ఈ సారి కూడా అరవింద్‌పై పోటీ చేస్తారో లేదో కేసీఆర్ డిసైడ్ చేస్తారని చెప్పుకొచ్చారు. బాస్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానాని, అరవింద్ మీద పోటీ చేయమంటే చేస్తా.. పోటీ చేయకపోయినా.. అరవింద్ ఓటమి కోసం వెళ్లి ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. అంటే అరవింద్‌పై పోటీ చేసే విషయంలో క్లారిటీ లేదు.

గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి అరవింద్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి కవిత సీటు మారుతుందని, జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చని ప్రచారం జరిగింది. ఇప్పుడు కవిత చెప్పిన మాటలు బట్టి చూస్తే అరవింద్‌పై పోటీ చేసే విషయం డౌటే..అంటే కవితకు మరో సీటు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఎలాగో జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నారు..కాబట్టి కవితని ఎమ్మెల్యే స్థానంలో నిలబెట్టే ఛాన్స్ ఉంది. చూడాలి మరి కవితని ఎక్కడ పోటీకి దింపుతారో.