లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్-కేజ్రీవాల్..బీజేపీ మార్క్ పాలిటిక్స్..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఏకంగా కేసీఆర్ కుమార్తె కవిత ఈ లిక్కర్ స్కామ్‌లో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది..ఇదే క్రమంలో ఈడీ రిపోర్టులో ఆమె పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై హాట్ హాట్ చర్చలు నడుస్తుండగానే..ఇప్పుడు ఏకంగా కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది.

డిసెంబర్ 6వ తేదీనా హైదరాబాద్ లేదా ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. ఇక దీనికి హైదరాబాద్‌లోని తన నివాసంలోనే విచారణ జరుపుకోవచ్చు అని కవిత సమాధానం ఇచ్చారు. ఇక ఈ నోటీసులపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అలాగే సీబీఐ నోటీసులు వచ్చిన వేళ..కేసీఆర్..తన కవితని ప్రగతి భవన్‌కు పిలిపించారు. నోటీసులని ఎలా ఎదురుకోవాలని, విచారణలో ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై కవితకు కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది.

ఇది ఇలా జరుగుతుండగానే..ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంలో బీజేపీ నేతలు..కేసీఆర్‌ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. చిన్న అవకాశం దొరికిన వదలని నేతలు..ఇప్పుడు కవితకు సీబీఐ నోటీసులు రావడంతో విరుచుకుపడుతున్నారు. రాజకీయంగా ఎంతలా వాడుకోవాలో..అంతలా వాడుకుంటున్నారు. పైగా ఇప్పుడు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ కొత్త కామెంట్స్ చేస్తున్నారు. ఈ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్నారని బాంబ్ పేల్చారు. అలాగే పంజాబ్ సీఎం కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు.

ఢిల్లీ మద్యం పాలసీపై మరింత విచారణ జరపాలని, కవితకు శిక్ష పడుతుందని తెలిపారు. అంటే ఈ అంశాన్ని పూర్తిగా రాజకీయంగా వాడుకోవడానికి బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే మరీ కేసీఆర్,కేజ్రీవాల్‌ని సైతం టార్గెట్ చేయడంతో..ఇది పూర్తిగా రాజకీయ కోణమే అని అర్ధమవుతుంది. మరి చూడాలి ఈ లిక్కర్ స్కామ్‌పై ఇంకేం తేలుతుందో.