సమయానికి తగ్గట్టుగా రాజకీయం చేయడం..పరిస్తితులని తమకు అనుగుణంగా మార్చుకోవడం..ఏదైనా వ్యతిరేకంగా మారుతుంటే…మళ్ళీ వాటిని తిప్పుకునేలా కార్యక్రమాలు చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. ఎలాంటి సందర్భాన్ని అయినా తమకు అనుగుణంగా మార్చుకుంటారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటినుంచే తమదైన శైలిలో ఎన్నికల కాన్సెప్ట్‌లని బయటకు తీస్తున్నారు.
ఎంత కాదు అనుకున్న వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుందనే భావన పెరుగుతుంది..ఈ క్రమంలో పూర్తిగా దాన్ని తగ్గించడం కోసం సరికొత్త కాన్సెప్ట్‌లతో వైసీపీ ముందుకొస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు గడపగడపకు వెళుతున్నారు. అటు సీఎం జగన్ భారీ సభలతో ప్రజల్లో ఉంటున్నారు. ప్రతిపక్ష టీడీపీని దెబ్బకొట్టేలా ఎప్పటికప్పుడు వ్యూహాలు అమలు చేస్తున్నారు. వైసీపీ వ్యూహాలు ఎలా ఉంటాయంటే..మామూలుగా జిల్లాల టూర్లకు వెళుతున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులతో నిరసనలు తెలియజేయడం.
పోనీ రాజధానుల కోసమో, కర్నూలులో హైకోర్టు కోసమో, ఏ ఇతర సమస్యలు వస్తాయనో నిరసనలు చేయడం అంటే వాటికి కొంత అర్ధం ఉంటుంది. కానీ తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా టూర్‌కు వెళ్ళిన బాబుకు..వైసీపీ శ్రేణులు నల్లబెలూన్లతో నిరసనలు తెలిపారు. బాబు రావద్దు అంటూ వారు నిరసనలు తెలిపారు. అంటే బాబుకు ఎక్కడకక్కడ నిరసనలు ఎదురవుతున్నాయని నెగిటివ్ చేసే విధంగా వైసీపీ కాన్సెప్ట్ ఉంది.
ఇదిలా ఉంటే..బీసీల ఓట్లు మళ్ళీ దక్కించుకోవడానికి డిసెంబర్ 7వ తేదీన జయహో బీసీ సభని నిర్వహిస్తున్నారు. విజయవాడలో జగన్ సమక్షంలో కార్యక్రమం జరగనుంది. మరి ఇప్పటివరకు బీసీలకు ఏం చేశారో చెబుతారా? లేక రాబోయే రోజుల్లో ఏం చేస్తారో చెబుతారో చూడాలి.
ఇక అటు డిసెంబర్ 5న కర్నూలులో రాయలసీమ గర్జన కార్యక్రమం చేస్తున్నారు. మూడు రాజధానులకు మద్ధతుగా, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కోసమని చెప్పి వైసీపీ నేతల ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. మరి అధికారంలో ఉండి కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు వైసీపీ ఎలాంటి కృషి చేస్తుందో క్లారిటీ లేదు. మొత్తానికి ఓట్ల వేటలో ఇవి కొత్త కాన్సెప్ట్స్ అని చెప్పవచ్చు.