కేటీఆర్ స్నేహగీతం.. అస‌లు కారణం ఏంటో

– బీజేపీ-టీఆర్ఎస్ క‌లిసి ముందుకు సాగాలంటున్న కేటీఆర్ ! మ‌రో వైపు కాషాయం దూకుడు.. మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ! దేనికి సంకేతం?

హైద‌రాబాద్ః ఆ రెండు పార్టీల మధ్య ప‌చ్చ గ‌డ్డి వేసిన భ‌గ్గుమంటుంది. ఆ రెండు పార్టీల నాయ‌కులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. ప్ర‌జ‌ల్లో త‌మ ఉనికిని మరింత బ‌లంగా మార్చుకోవ‌డంతో పాటు పార్టీపై ప్ర‌జ‌లకున్న న‌మ్మ‌కాన్ని స‌డ‌లనియ‌కుండా ఉండేందుకు ఓ పార్టీ ప్ర‌య‌త్నం.. మ‌రో పార్టీదేమో రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నిక‌‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించి.. అధికారం పీఠం ద‌క్కించుకోవాల‌నే ఆరాటం! ఇప్పుడు ఆ రెండు పార్టీల తీరుతో తెలంగాణం వెడెక్కుతోంది. ఆ రెండు పార్టీలే టీఆర్ఎస్‌, బీజేపీలు. గ‌త కొంత కాలంగా ఈ రెండు పార్టీలు తెలంగాణ‌లో రాజకీయ‌ కాకా పుట్టిస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో అధికార పార్టీ నేత, రాష్ట్ర మంత్రి కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి.

తాజాగా ప్ర‌భుత్వం హైదరాబాద్‌లో ప‌‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టింది. ఇందులో భాగంగా కొత్తగా నిర్మించిన డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు రాష్ట్రమంత్రులతో కలిసి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నిక‌ల స‌మ‌యంలో పోటీ ప‌డ‌దామ‌ననీ, ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌జ‌ల‌ కోసం క‌లిసి ప‌నిచేయాల‌ని అన్నారు. రాజ‌కీయాల్లో పోటీ ఉండాలి కానీ, కొట్లాట‌‌లు ఉండ‌కూడ‌ద‌నీ, ఈ విధంగానే నేత‌లంద‌రూ ముందుకు సాగాలంటూ వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌త్య‌క్షంగా ఆయ‌న బీజేపీ అని ప్ర‌స్తావించ‌క‌పోయిన కమల నేత‌ల‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.

దీనితో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పేద‌లు అధిక సంఖ్య‌లో ఉన్నార‌నీ, వారంద‌రికీ డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించేందుకు కేంద్రం స‌హ‌కారం అందించాల‌ని అన్నారు. అలాగే, కంటోన్మెంట్ ప్రాంతంలో భూములు ప‌ట్టాలు ఇప్పించేందుకు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి చోర‌వ తీసుకునే దానికి అనుగుణంగా కృషి చేయాల‌ని అన్నారు. కిష‌న్ రెడ్డి ప్ర‌సంగం సైతం సానుకూల ధోర‌ణిలోనే కొన‌సాగింది.

అయితే, ఒక‌రిపై ఒక‌రు మాట‌ల‌తో ఎదురుదాడికి దిగే బీజేపీ-టీఆర్ఎస్ నేత‌లు ఒకే వేదిక‌పై చేసిన ప్ర‌స్తుత వ్యాఖ్య‌లు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా కేటీఆర్ వ్యాఖ్య‌లు రాష్ట్రవ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక‌, ఇటీవ‌ల జ‌రిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇరు పార్టీలు నువ్వా నేనా అనే రీతిలో ప్ర‌చారంలో దూసుకుపోయాయి. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు, మాట‌ల‌తో ప్ర‌తిదాడులు చేసుకున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో అనుకున్న దానికంటే భారీ స్థాయిలో బీజేపీ ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకోగ‌లిగింది. ఇదే దూకుడుతో 2023 అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా టీఆర్ఎస్‌పై ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు గుప్పిస్తూ కాషాయ ద‌ళం దూసుకుపోతోంది.

ఇక‌, గ‌త నెల‌లో సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న అనంత‌రం నుంచి గులాబి పార్టీ నేత‌ల తీరులో కొద్ది మేర మార్పులు క‌నిపిస్తున్నాయి. త‌న‌దైన రీతిలో బీజేపీపై పంచులు, విమ‌ర్శ‌లు గుప్పించే కేసీఆర్‌ సైతం సైలెంట్ అయ్యార‌నిపిస్తోంది. బీజేపీపై నిప్పులు చెరిగే కేటీఆర్ సైతం ఇరు పార్టీలు క‌లిసి రావాలంటూ వ్యాఖ్య‌నించ‌డం కొత్త రాజ‌కీయ వ్యూహ‌మా అనిపించ‌క మాన‌దు. ఎందుకంటే.. ఇటీవ‌లే ఎన్నిక‌ల్లో కాస్త వెనుకుబ‌డిన టీఆర్‌ఎస్.. ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకుంద‌ని తెలుస్తోంది. దీనిలో భాగంగానే అతిగా బీజేపీపై విమ‌ర్శ‌లు చేయ‌డం కాషాయ పార్టీకే అనుకూలంగా మారుతుంద‌ని గులాబి ద‌ళం భావిస్తున్న‌ట్టుంది. దీనికి తోడు కేంద్రంతో వైరం మ‌రింత‌గా పెంచుకుంటే.. రాష్ట్రానికి అందే నిధుల విష‌యంతో పాటు, ఇత‌ర స‌మ‌స్య‌ల‌కు స‌హ‌కారం అంద‌కుండా పొతుందేమోన‌ని గులాబి ద‌ళం అనుకుంటున్న‌ద‌ట‌! అందుకే సైలెంట్‌గానే క‌మ‌ళాన్ని ఖ‌తం ప‌ట్టించాల‌ని గులాబి పార్టీ ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని తెలిసింది. దీనిలో భాగంగానే రాష్ట్ర అధికార నేత‌లు…

స‌రికొత్త వ్యూహాన్ని అనుస‌రిస్తున్నార‌నీ, పార్టీ సూచ‌న‌ల ప్ర‌కారం ముందుకు సాగుతున్నార‌ని స‌మాచారం. అయితే, రాష్ట్ర బీజేపీ నేత‌లు మాత్రం టీఆర్ఎస్ పై చేస్తున్న పోరును మాత్రం ఇంకా ఉధృతం చేస్తున్నారు. చూడాలి మ‌రి మునుముందు ఎలాంటి అస్త్రాల‌తో ఇరు పార్టీలు త‌మ మ‌నుగ‌డ కోసం ముందుకు సాగుతాయో! .. అయితే, ఇక్క‌డ గులాబి, క‌మ‌లం పార్టీ నేత‌లు గ‌మ‌నించాల్సిన విష‌యం ఎమిటంటే.. రాజ‌కీయ వైరం ఎలా ఉన్నా.. చివ‌రి ల‌క్ష్యం ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌డం అనే విష‌యాన్ని మ‌ర‌వ‌కూడ‌ద‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు.