ఏపీలో రాజకీయాలు హాట్ గా ఉంటాయి. అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఎప్పుడూ మసులుతూ ఉంటాయి. ఇక ఆయా పార్టీల కార్యకర్తలైతే బద్ద శత్రువుల్లా చూసుకుంటారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతూ వేధిస్తున్నారని టీడీపీ నేతలు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. తాజాగా ఈ విషయంపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ మొదలైంది.టీడీపీ కార్యకర్తల కోసం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు ఐ టీడీపీ బ్లాగ్. కామ్ పేరుతో వెబ్ సైట్ ను ను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వలన ఇబ్బందులు పడే టీడీపీ శ్రేణులు దీని ద్వారా టీడీపీ అధినాయకత్వానికి నేరుగా పిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఇకపై కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుందని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టింగులు చేసే టీడీపీ కార్యకర్తలను కూడా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. వారు కూడా ఇందులో పిర్యాదు చేస్తే పార్టీ నాయకత్వం వారి సమస్యలపై పోరాడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై నిప్పులు చెరిగారు. త్వరలోనే జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించే రోజు వస్తుందని అన్నారు. ఈ వెబ్ సైట్‌కు ఇంచార్జిగా ఉన్న విజయ్ అనే వ్యక్తిని ఈ సందర్బంగా లోకేష్ అభినందించారు. జగన్ మోహన్ రెడ్డి పాలన నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రతి ఒక టీడీపీ కార్యకర్త ఐటీడీపీలో భాగస్వామ్యం కావాలని తెలిపారు.