బీజేపీలోకి మల్లారెడ్డి ఫ్యామిలీ.. కేసీఆర్ ప్రధాని..!

మంత్రి మల్లారెడ్డి ఇంటిపై, ఆఫీసులు, కాలేజీలు..అలాగే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఇంకా బంధువులు, సన్నిహితుల ఇళ్ళు, ఆఫీసులపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా బీజేపీ చేయిస్తున్న పని, దీనికి భయపడాల్సిన పని లేదని కేసీఆర్..తమ నేతలకు సూచించారు.

కానీ ఐటీ రైడ్స్ విషయంలో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొంది..పైగా మల్లారెడ్డికి సంబంధించి కొంత నగదు కూడా సీజ్ చేసినట్లు తెలిసింది. మెడికల్ కాలేజ్ సీట్లలో స్కామ్ జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే రెండు రోజుల పాటు జరిగిన రైడ్స్‌లో మల్లారెడ్డి వర్సెస్ ఐటీ అధికారులు అన్నట్లు పోరు నడిచింది. ఇదే క్రమంలో హాస్పిటల్‌లో ఉన్న తన తనయుడు చేత బలవంతంగా సంతకం చేయించుకున్నారని, తన మనవరాలుని బెదిరించారని చెప్పి మల్లారెడ్డి..ఐటీ అధికారులపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

ఇదే తరుణంలో ఐటీ రైడ్స్ ముగిసిన నేపథ్యంలో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దాడుల విషయం సీఎం కేసీఆర్‌ ముందే చెప్పారన్నారు. తెలంగాణపై బీజేపీ కుట్రలు చేస్తోందని, సీఎం కేసీఆరే మా ధైర్యమని, అంతా ఆయనే చూసుకుంటారని, ఈ బీజేపీ మమ్మల్నే కాదు.. ముఖ్యమంత్రిని కూడా ఏం చేయలేదని అన్నారు. 2024లో కేసీఆర్ ప్రధాని అవుతారని చెప్పుకొచ్చారు.

మేనేజ్‌మెంట్‌ కోటా లేకపోతే డొనేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దాడుల్లో ఏదైనా దొరికితే చూపించాలి కదా? అని మల్లారెడ్డి అన్నారు. రూ.100 కోట్ల బ్లాక్‌ మనీ ఉందని సంతకం పెట్టించుకున్నారని, లేని డబ్బును ఎక్కడ చూపించాలని ప్రశ్నించారు. ఇంకా మూడు నెలల పాటు మమ్మలని వేధిస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు.

అటు బీజేపీలో చేరాలని, తమపై ఐటీ దాడులు చేయిస్తున్నారు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన కుమార్తె పట్ల ఐటీ అధికారులు అమానుషంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చారు. అయితే మల్లారెడ్డి ఫ్యామిలీ..ఐటీ దాడులు ఎందుకు జరిగాయనేది క్లియర్ గా చెప్పకుండా..బీజేపీ ప్లాన్ అని, బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని, చెప్పి టాపిక్ మొత్తం డైవర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మళ్ళీ ఇందులో కేసీఆర్ ప్రధాని అవుతారని భజన చేయడం ఒకటి అని అంటున్నారు. మొత్తానికి ఐటీ రైడ్స్ టీఆర్ఎస్ నేతలని వణికిస్తున్నాయి.