ఎన్నికల సమయం దగ్గరపడటంతో కేసిఆర్..అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 70-80 మందితో తొలి లిస్ట్‌ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నెలలోనే తొలి లిస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే గెలుపు అవకాశాలు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఇక ఒక సీటు కోసం ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ ఉన్న స్థానాలపై మరోసారి కసరత్తు చేస్తారని తెలుస్తోంది.
ఇదే క్రమంలో పలు సీట్లని పెండింగ్ లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే మంథని సీటు విషయంలో ఇంకా చర్చలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ సీటు అయిన మంథనిలో బిఆర్‌ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇంతవరకు క్లారిటీ లేదు. వాస్తవానికి మంథని కాంగ్రెస్ కంచుకోట. దివంగత, మాజీ ప్రధాని పివి నరసింహారావు ఇక్కడ నుంచి నాలుగు సార్లు గెలిచారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు టిడిపి గాలిలో సైతం 1983, 1985, 1989 ఎన్నికల్లో గెలిచారు.
ఇక శ్రీపాదరావు మరణంతో ఆయన తనయుడు శ్రీధర్ బాబు ఎంట్రీ ఇచ్చారు..ఆయన 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. తెలంగాణ వచ్చాక 2014 ఎన్నికల్లో శ్రీధర్ బాబు ఓటమి పాలయ్యారు. బిఆర్‌ఎస్ నుంచి పుట్టా మధు గెలిచారు. 2018 లో సీన్ రివర్స్ అయింది..శ్రీధర్ బాబు మళ్ళీ గెలిచారు. ఇక రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు పోటీ చేయడం ఖాయం.
కానీ బిఆర్‌ఎస్ నుంచి అభ్యర్ధి తేలడం లేదు..పుట్టా మధుకు కాటారం సింగిల్ విండో ఛైర్మన్ చల్లా నారాయణరెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. వీరిద్దరి మధ్య సీటు కోసం పోటీ నడుస్తోంది. ఇక సర్వే బట్టి కేసిఆర్..ఈ సీటు డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. చివరికి మంథని సీటు ఎవరికి దక్కుతుందో..శ్రీధర్ బాబుకు ఎవరు చెక్ పెడతారో చూడాలి.