ఇటీవల ఏపీలో సర్వేల హడావిడి ఎక్కువైన విషయం తెలిసిందే. ఎన్నికలకు సమయం ఉండగానే…రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ అధికారమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పోటాపోటీ వాతావరణం ఉంది. ఇక ప్రస్తుత రాజకీయ పరిస్తితులపై ఎప్పటికప్పుడు సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆత్మసాక్షి సర్వే ఒకటి వచ్చిన విషయం తెలిసిందే.
ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పింది. అలా అని ఈ సర్వేని నమ్మడానికి లేదు. అలాగే దీన్ని కొట్టి పారేయడానికి లేదు. దీని బట్టి పార్టీలు పరిస్తితిని కాస్త అంచనా వేసుకోవచ్చు…ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. అయితే ఈ సర్వేలో పలువురు మంత్రులకు కూడా ఓటమి తప్పదని తేలింది. నియోజకవర్గాల్లో పెద్దగా అందుబాటు ఉండని మంత్రులకు చెక్ పడేలా ఉంది.
సర్వే ప్రకారం చూసుకుంటే…అమలాపురంలో పినిపే విశ్వరూప్, తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, పెడనలో జోగి రమేష్, వేమూరులో మేరుగు నాగార్జున, చిలకలూరిపేటలో విడదల రజిని, కళ్యాణదుర్గం ఉషశ్రీ చరణ్, నగరి రోజాలకు నెక్స్ట్ గెలుపు చాలా కష్టమని సర్వేలో తేలింది.
ఒకవేళ టీడీపీతో జనసేన పొత్తు ఉంటే…అలాగే టఫ్ ఫైట్ ఎదురుకునే మంత్రులు వచ్చి…శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు, పలాసలో సీదిరి అప్పలరాజు, అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్, కొవ్వూరులో తానేటి వనిత, సత్తెపల్లిలో అంబటి రాంబాబు, డోన్‌లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆలూరులో గుమ్మనూరు జయరాంలకు ఈ సారి గట్టి పోటీ ఎదురయ్యేలా ఉంది. మొత్తానికి టీడీపీ-జనసేన పొత్తు ఉంటే మాత్రం చాలామంది మంత్రులకు గెలుపు కష్టమయ్యేలా ఉంది.
అలాగే మాజీ మంత్రులు కొందరు రిస్క్‌లో ఉన్నారు…పేర్ని నాని, ధర్మాన కృష్ణదాస్, అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆళ్ళ నాని, సుచరిత, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, రంగనాథరాజు, పుష్పశ్రీ వాణి, అనిల్ కుమార్ యాదవ్..ఇలా కొందరు మాజీ మంత్రులకు కూడా గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని సర్వేలో తేలింది.