ముస్లిం ఓట్లకు గాలం మోడీ మామూలోడు కాదు భయ్యా

-

బీజేపీని అధికారం నుంచి దించేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి.ఈ తరుణంలో ముస్లింల ప్రాబల్యం ఉన్న స్థానాల్లో కూడా విపక్షాలకు సవాల్ విసిరేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇందుకోసం మైనారిటీ, ముఖ్యంగా ముస్లిం వర్గాలకు చెందిన వారితో బీజేపీ దోస్తీ చేస్తోంది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో ఐదు వేల మంది మోదీ మిత్రలను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలోముస్లింలు ప్రాతినిథ్యం వహించే స్థానాలు 65 ఉన్నాయి. వాటిల్లో మైనారిటీ నేతలను నిలబెట్టి కనీసం 50 శాతం మైనార్టీ ఓటింగ్‌ సాధించేలా బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.ముస్లిం కమ్యూనిటీలో అత్యధికులుగా ఉన్న పాస్మండ ముస్లింలపై బిజెపి చాలా కాలంగా దృష్టి పెట్టి వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా, మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వర్గానికి సంబంధించి ప్రత్యేక సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది కేవలం వేదికపైనే కాదు.. ముస్లిం ఓట్లను కూడా రాబట్టేందుకు బీజేపీ గ్రౌండ్ లెవెల్లో వ్యూహాత్మకంగా పనిచేస్తోంది.

ఇప్పటి వరకు 36 వేల మంది మోదీ స్నేహితులు తయారైనట్లు సమాచారం. ఈ విషయాన్ని బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ కూడా ధృవీకరించారు. దేశంలోని 65 లోక్‌సభ స్థానాలలో ముస్లిం మైనార్టీలు ఎంపీలుగా ఉన్నారని సిద్ధిఖీ తెలిపారు.ఇక్కడ మైనారిటీ జనాభా 30 శాతానికి పైగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ స్థానాల్లో పెద్ద సంఖ్యలో మెడీ మిత్రలను తయారు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ మోడీ మిత్రలు బీజేపీ కేడర్ కార్యకర్తలు కాదు, వివిధ రంగాలకు చెందిన సామాన్యులు. సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ అనే ప్రధాని నరేంద్ర మోదీ మంత్రంతో ముగ్ధులైన లేదా ఏకీభవించిన వారిని మోదీ మిత్రలుగా చేసి సర్టిఫికెట్లు ఇస్తున్నారు.ఈ మొత్తం పార్లమెంటు స్థానాలకు ఒక కేంద్ర ఇన్‌చార్జి, ఒక రాష్ట్ర ఇన్‌చార్జిని నియమించి వారితో నిత్యం టచ్‌లో ఉండేలా కార్యాచరణ రూపొందించారు. తమ పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఇన్‌చార్జి, 30 మంది కో-ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. ఒక్కో కో-ఇన్‌చార్జ్‌కి ముప్పై మంది మోడీ స్నేహితులను చేసే పనిని అప్పగించారు. ఇలా ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గంలో 900 మంది, లోక్ సభ నియోజకవర్గంలో ఐదు వేల మంది చొప్పున మోదీ స్నేహితులను చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వీళ్ళ సాయంతో ముస్లిం వర్గానికి పార్టీ విధివిధానాలను సందేశంగా తెలియజేస్తారు.ప్రతి మోడీ స్నేహితుడు తన ప్రాంతంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ ప్రతినిధులతో కలిసి ప్రజలతో మాట్లాడాలని హైకమాండ్‌ ఆదేశించింది. వారు ప్రభుత్వ పథకాల గురించి సమాచారం అందించి, పొందలేకపోయిన పథకాల ప్రయోజనాలను పొందేలా అవగాహన కల్పిస్తారు. అంతేకాదు వారి అభ్యున్నతికి మోడీ సర్కారు తీసుకుంటున్న ప్రత్యేక చొరవను వివరిస్తారు.ఈ విధంగా ప్రతి లోక్‌సభ స్థానంలో ఎన్నికల్లో బిజెపి తరపున నిలబడిన అభ్యర్థి 50,000 ముస్లిం లేదా మైనారిటీ ఓట్లను పొందాలనేది ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యూహంలో బీజేపీ విజయం సాధిస్తే ముస్లింల ప్రాబల్యం ఉన్న స్థానాల్లో కూడా ప్రత్యర్థి పార్టీలకు గట్టి సవాల్ విసిరినట్లే. ఈ 65 ముస్లిం మెజారిటీ సీట్లు 13 రాష్ట్రాలకు చెందినవి. వీటిలో అత్యధికంగా 13 సీట్లు ఉత్తరప్రదేశ్ నుండి మాత్రమే ఉన్నాయి. అది కూడా పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి.ఇది కాకుండా పశ్చిమ బెంగాల్‌లో 12 మరియు కేరళలో వాయనాడ్‌తో సహా 7 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అస్సాంలోని ఏడు సీట్లపై కూడా బీజేపీ కన్నేసింది. బీహార్, జమ్మూ కాశ్మీర్‌లలో నాలుగు సీట్లు, మధ్యప్రదేశ్‌లో మూడు సీట్లు ఉన్నాయి. వీటిలో బీజేపీ ప్రభావాన్ని చూపేందుకు ఆ పార్టీ నేతలు పక్కా వ్యూహాలతో సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version