మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప.. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న తమ కుటుంబాన్ని అణగదొక్కేందుకు యత్నించారని తోట నరసింహం, ఆయన భార్య వాణి వాపోయారు..
ఏపీలో టీడీపీకి తగిలే షాక్ లు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖేల్ ఖతమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన పలు ముఖ్య నేతలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీకి చెందిన కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం టీడీపీకి, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన లోక్ సభలో టీడీపీ పక్ష నేత.
నేడు వైఎస్సాఆర్సీపీలో చేరిక
టీడీపీకి రాజీనామా చేసిన తోట నరసింహం… ఇవాళ వైఎస్సాఆర్సీపీ పార్టీలో చేరనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తన భార్య తోట వాణి, తన అనుచరులు, సన్నిహితులతో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు.
టీడీపీలో కష్టపడినా కూడా గుర్తింపు లేదని.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో టీడీపీ తరుపున పోరాటం చేసి అనారోగ్యం బారిన పడినా.. తనను ఎవరూ పట్టించుకోలేదని తోట నరసింహం వాపోయారు. అందుకే పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. అనారోగ్యం కారణంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నానని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ నిర్ణయం మేరకు తన కుటుంబం నడుచుకుంటుందని, తమకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తోట నరసింహం వెల్లడించారు.