బిడ్డా కౌశిక్ రెడ్డి క్ష‌మాప‌ణా?? శ‌త్రుత్వ‌మా.. డిసైడ్ చేస్కో.. ముదిరాజ్‌ల అల్టిమేటం..

-

వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు అధికారపార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. అధికారం ఉంది కదా అని ఎవరి మీద పడితే వారి మీద నోరు జారుతున్నారు. గతంలో గవర్నర్ అనుచిత వ్యాఖ్యలు చేసి.. మహిళా కమీషన్ నోటీసులు అందుకున్నారు. తర్వాత ఓ ప్రభుత్వ అధికారిపై తిట్ల దండకం అందుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొన్ని రోజుల కిందట రైతు దినోత్సవం రోజున సిగ్గులేదా రైతు బంధు తీసుకోవడం లేదంటూ రైతుపై నోరు జారారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా మళ్లీ ముదిరాజ్ లపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. దీనిపై ముదిరాజ్ కులస్తులు పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

తాజాగా హుజూరాబాద్‌లో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కెమెరామెన్‌ను రాయలేని విధంగా ఎమ్మెల్సీ తిడుతున్న ఆడియో వైరల్‌ అయింది. ఆయ‌నని కులం పేరుతో దూషిస్తూ, అమ్మ‌నా బూతులు తిట్టాడు. బాధితుడు అజయ్‌ తనకు కౌశిక్‌రెడ్డితో ప్రాణహాని ఉందని మధ్యాహ్నం సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేశారు. గురువారం హుజూరాబాద్‌లో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు కెమెరామెన్ వెళ్లారు. అక్కడ ఓ మహిళ.. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిని సంక్షేమ పథకాలు రావడం లేదంటూ అడుగుతున్న విషయాన్ని కెమెరాలో రికార్డు చేస్తుండగా ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి అనుచరులు వచ్చి అజయ్‌ ను కారులో తీసుకెళ్ళి ఇష్టానుసారంగా దాడి చేశారన్నారు. అంతటితో ఆగకుండా కులం పేరు పెట్టి రాయలేని బూతులతో దూషించారని కెమెరామెన్ అజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ ఘటన పై ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న‌డిమంత‌రాన వ‌చ్చిన ప‌ద‌విని చూసుకొని విర్ర‌వీగితే త‌మ స‌త్తా చూపిస్తామ‌ని, రాజ‌కీయ భ‌విష్య‌త్ లేకుండా చేయ‌గ‌ల‌మ‌ని హెచ్చ‌రించారు. త‌మ కులానికి చెందిన ఈటెల రాజేంద‌ర్ రాజీనామా చేస్తే ఆయ‌న‌పై గెల‌వ‌లేక ఓడిపోయి, కేసీఆర్ బిక్ష వేస్తే ఎమ్మెల్సీ అయ్యావ‌నే విష‌యం వ‌ర‌వ‌ద్దు. కౌశిక్ రెడ్డిని త‌క్ష‌ణ‌మే భ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. భేష‌ర‌తుగా త‌మ కులానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని, క్ష‌మాప‌ణా లేక శ‌త్రుత్వ‌మా తేల్చుకోవాల‌ని సూచించారు. తప్పు చేస్తే క్షమించే గుణం ముదిరాజ్ కులస్థులకు ఉందని పలువురు వ్యాఖ్యానించారు. ముదిరాజ్ కుల మహిళ సంఘాలు సైతం పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

 

ఇప్ప‌టికే జిల్లాలు, మండ‌లాలు, గ్రామాల్లో కౌశిక్ రెడ్డిపై నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కులస్థులు ధర్నా నిర్వహించారు. పార్టీల‌కు అతీతంగా ముదిరాజ్‌లు అంద‌రూ ఏక‌మ‌వుతున్నారు. ముది రాజ్ కులాన్ని, కులస్థులను కించపరుస్థూ అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హనుమకొండ జిల్లా లోని ముదిరాజ్ కుల పెద్దలు పెద్ద ఎత్తున హాజరై చౌరస్తా కూడలిలో పాడి కౌశిక్ రెడ్డి అతని దిష్టిబొమ్మను దహనం చేశారు. ముదిరాజ్ ల అండలేకుండా ఏ రాజకీయ నాయకులు అధికారంలోకి రాలేరని ముదిరాజ్ కుల నాయకులు హెచ్చరిస్తున్నారు. ముదిరాజ్ లతో పెట్టుకుంటే రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తామన్నారు. పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లను పార్టీలో పెట్టుకోవద్దని ఆ కుల నాయకులు కేసీఆర్ కు సూచించారు.

 

తాము రాజ‌కీయంగా బ‌లంగా లేనందుకే ఇలాంటి మాట‌లు ప‌డాల్సి వ‌స్తుంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌భా ప్రాతిప‌దిక‌న త‌మ‌కు రావాల్సిన సీట్లు కేటాయించాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌తీ రాజ‌కీయ పార్టీ ఈ విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని, ముదిరాజ్‌ల‌ను త‌క్కువ‌గా అంచ‌వేస్తే దానికి మూల్యం చెల్లిస్తార‌ని హెచ్చ‌రించారు.

ఈ క్రమంలోనే కెమెరామెన్ అజయ్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్​ రెడ్డితో తనకు ప్రాణభయముదని హుజూరాబాద్​పోలీస్​ స్టేషన్​లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. తనను, తన కుటుంబాన్ని చంపుతానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనతో పాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, సదరు యూట్యూబ్‌ చానల్‌ యజమానిని హతమారుస్తానని హెచ్చరించినట్లు అజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సీఐ రమేశ్ సమాధానం ఇస్తూ ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news