తెలంగాణలో కమల వికాసమే

-

  • అనూహ్యంగా పుంజుకున్న భారతీయ జనతాపార్టీ
  • ఫలించనున్న ప్రధాని మోడీ త్రిశూల వ్యూహం
  • తాజా సర్వేలను చూసి బీఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌ పార్టీలలో దడ
  • కేసీఆర్‌ సర్కారు చాపచుట్టేయడం ఖాయమంటున్న సర్వేలు

అప్పటివరకు రేసులో ఉన్న భారతీయ జనతాపార్టీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి తెలంగాణలో వెనకబడిపోయిందనుకున్నారు అంతా.అయితే అనూహ్యంగా పుంజుకుని ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వచ్చింది కాషాయదళం. తెలంగాణలో తాజాగా వస్తున్న సర్వేలు ఇప్పుడు ఇదే వాస్తవాన్ని బహిర్గతం చేస్తున్నాయి.ఓటర్‌ వాయిస్‌ చేపట్టిన సర్వే ప్రకారం కమలానికి తెలంగాణలో 62 సీట్లు వస్తాయని అంచనా వేసింది.119 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ 45 చోట్ల సునాయాసంగా గెలుస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

కొన్నిచోట్ల గట్టి పోటీ నడిచినా అంతిమంగా బీజేపీ అభ్యర్థులే గెలుస్తారని ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే తెలంగాణలో బీజేపీదే అధికారమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కేసిఆర్‌ ప్రభుత్వాన్ని ఎప్పుడో పక్కన పెట్టేశారని తాజాగా అనేక సర్వేలు చెప్తున్నాయి. అగ్రనేతల పర్యటనతో క్షేత్రస్థాయిలో బీజేపీ కి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కొన్ని రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.సైలెంట్‌ ఓటింగ్‌ని రాబట్టుకునే దిశగా బీజేపీ వేసిన అడుగులు మంచి ఫలితాలను తీసుకువస్తాయని ఆశిస్తున్నారు.

పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న వేళ బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ర్టానికి క్యూకట్టారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబరు 26,27,28 తేదీల్లో తెలంగాణలోనే మకాం వేశారు.త్రిశూల వ్యూహాన్ని అమలు చేసి బీజేపీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారాయన.బీజేపీ గెలిస్తే ఈటెల రాజేందర్‌ ముఖ్యమంత్రి అవుతారనే సంకేతాలను ఇప్పటికే బీసీ వర్గాల్లోకి పంపిన మోగీ అటు ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన హామీ ఇచ్చి ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణ కూడా ప్రారంభించారు. దీంతో 30 లక్షలకు పైగా ఉన్న మాదిగలు ఇప్పుడు కాషాయపార్టీతో నడుస్తున్నారు.

అంతే కాదు ఉత్తరాది రాష్ర్టాల నుంచి వచ్చి తెలంగాణలో నివశిస్తున్న వారిని టార్గెట్‌ చేసుకున్న ప్రధాని తన హామీలతో అకట్టుకుంటున్నారు.ఆయనతో పాటు కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌షా సుడిగాలి పర్యటనలు చేస్తూ గెలుపే లక్ష్యంగా ప్రసంగాలు చేస్తున్నారు. అధికారంలోకి వస్తే మత ఆధారిత రిజర్వేషన్‌లను రద్దు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన అమిత్‌షా…బీజేపీ గెలిస్తే బంగారు తెలంగాణ నిర్మాణం ఎలా చేయవచ్చో ముందుగా ప్రజలకు వివరించారు.ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా తెలంగాణ రాష్ర్టంలో సందడి చేశారు.తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్న యోగీ డబుల్‌ ఇంజన్‌ సర్కారును ఎంచుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

బీసీ అభ్యర్ధిని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ప్రకటించినప్పటి నుంచి తెలంగాణ ఓటర్లలో చైతన్యం వచ్చింది.అన్ని పార్టీలకంటే బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించిన పార్టీగా బీజేపీ గుర్తింపు పొందింది.అటు మహిళలకు కూడా అన్ని పార్టీలకంటే ఎక్కువ సీట్లు దక్కింది కూడా బీజేపీలోనే.అమలయ్యే అంశాలను మాత్రమే మేనిఫెస్టోలో పెట్టి స్పష్టమైన వైఖరితో దూసుకుపోతోంది. బండి సంజయ్‌ని అధ్యక్షుడిగా తొలగించాక కాస్త ఊపు తగ్గినట్టు కనిపించినా ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు హైప్‌ తెచ్చాయి.ఈ సారి పార్లమెంట్‌ సభ్యులను అసెంబ్లీ బరిలో నిలపడం వంటి అంశాలు ఆ పార్టీ చరిష్మాను చెప్తున్నాయి.కొన్ని స్థానాల్లో బలమైన అభ్యర్ధులను నిలపడం,ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేసి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం వంటివి బీజేపీకి కలిసి వచ్చే అంశాలు.పసుపు బోర్డు,గిరిజన యూనివర్సిటీ లాంటి హామీలు ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి. మోడీ చరిష్మా కూడా తెలంగాణ బీజేపీకి అదనపు బలంగా మారింది.

కొండంత రాగం తీసి కూసింత పాట పడినట్టుంది తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్‌ పార్టీ తీరు. కర్నాటకలో విజయాన్ని చూసి తెగ ఉబ్బిపోయిన ఆ పార్టీ నేతలు తెలంగాణలో కూడా అధికారం తమదే అంటూ తెగ ప్రగల్బాలు పలికారు.నేనంటే నేనే సీఎం అంటూ పోటీ పడ్డారు.రేవంత్‌రెడ్డి అయితే తన అనుచరులతో తానే సీఎం అని పలు సభల్లో కూడా చెప్పించుకున్నారు. కాంగ్రెస్‌ నేతలు చెప్పినట్లు దశరా,దీపావళి పండగల వరకు ఆ పార్టీదే హవా నడిచింది. ఆ తరువాత కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోదూ వచ్చింది. గతవారం నుంచి మరీ దారుణంగా కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోయింది. మౌత్‌ పబ్లిసిటీ ఆ పార్టీ కొంప ముంచిందనే చెప్పాలి.

కాంగ్రెస్‌ గాలి వీయడంతో స్ర్టాటజీలన్నీ పక్కన పెట్టేశారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అస్ర్తాలన్నీ ముందే వాడేశారు.అదిగో సోనియమ్మ వచ్చేస్తుంది.. తెలంగాణలో అధికారం మనదే అంటూ ఊకదంపుడు ప్రసంగాలిచ్చేశారు రేవంత్‌రెడ్డి. సీఎం అభ్యర్ధి ఎవరు అనే అంశంపై క్లారిటీ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అనే సందేహాలు వచ్చాయి. అయితే కర్నాటకలో విజయం కొంత సానుకూల పవనాలు తీసుకువచ్చింది. దీంతో వాపు చూసి బలుపు అనుకున్న కాంగ్రెస్‌.. వీర లెవెల్లో రెచ్చిపోయి తెలంగాణ రాష్ర్టంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలను చేపట్టింది. అయితే తాజాగా కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత సర్వే ఆ పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది.

కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ హెడ్‌ కనుగోలు సునీల్‌ చేపట్టిన సర్వేలో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతికష్టం మీద 25-30 సీట్లు గెలుస్తుందే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం కాంగ్రెస్‌కి లేదని సునీల్‌ తేల్చేశాడు.కాంగ్రెస్‌ గెలుస్తుంది అంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న ఎస్‌ఎంఎస్‌లు బెట్టింగ్‌లను ప్రోత్సహించడానికే అంటున్నారు ఆ పార్టీ నేతలు.ఈ సారి మూడవ స్థానమే అంటున్నారు వారికి మద్ధతు ఇచ్చే మీడియా ప్రముఖులు కూడా.దీంతో కాంగ్రెస్‌కి వచ్చిన హైప్‌ కేవలం గాలి బుడగే అని తేలిపోయింది.తాజా పరిణామంతో కాంగ్రెస్‌ పార్టీలోని అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు. రాష్ర్ట అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధినేత్రి రాకపోవడం కూడా ఓటర్లలో ప్రతికూల పల్స్‌కి దారితీస్తున్నాయి.కేవలం రాహుల్‌గాంధీ,ప్రియాంకా గాంధీ మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news