రెండు తెలుగు రాష్ర్టాల్లో అధ్యక్షులను మార్చేసింది భారతీయ జనతా పార్టీ. గత కొద్దిరోజులుగా ఇరు రాష్ర్టాల్లో పార్టీ నేతల మధ్ గ్రూపులు పెరిగిపోయాయ్.ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకోవడం,కార్యకర్తలను అయోమయానికి గురిచేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.ఈ నేపథ్యంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది బీజేపీ అధిష్టానం.తెలంగాణకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని,ఏపీకి సత్యకుమార్‌ని అధ్యక్షులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఇవాళ సాయంత్రం లోపు ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణ వరకే అధ్యక్ష మార్పు ఉంటుంది అనుకుంటున్న తరుణంలో ఇటు ఏపీలోనూ నాయకత్వాన్ని మార్చే ప్రయత్నం చేయడం చర్చకు దారితీసింది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజుని ఎందుకు మార్చాల్సి వచ్చిందనే ప్రశ్న ఇప్పుడు అందరినీ వెంటాడుతోంది. ఇటీవల సోము వీర్రాజు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపించాయి. వైసీపీ అక్రమాలపై పెద్దగా ప్రశ్నించే ప్రయత్నం చేయకపోవడం,పార్టీలోని గందరగోళాలను గాలికి వదిలేయడం వంటి పరిణామాలు నాయకత్వ మార్పునకు కారణాలుగా బీజేపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. అందుకే ఆయనకు ఉద్వాసన పలికారని అంటున్నారు.మొదటి నుంచి బీజేపీ మూలాలు తెలిసిన వ్యక్తులను అధ్యక్షలుగా నియమిస్తే అంతా మంచి జరుగుతుందన్న సలహా మేరకు ఢిల్లీలోని పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అధ్యక్షుడి మార్పుపై తనకు ముందే సమాచారం ఉందన్నారు ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. తనకు కేంద్ర కమిటీలో పదవి పదవి ఇస్తామని జెపీ నడ్డా చెప్పినట్లు సోమువీర్రాజు స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షల మార్పు మంచి ఫలితాలను ఇవ్వదు అంటున్న బండి సంజయ్ అధిష్టానం నిర్ణయం పట్ల వ్యతిరేకత తెలియజేశారు.పైగా అధ్యక్షుడిగా తప్పుకునేందుకు సుముఖంగా లేనని స్వయంగా పార్టీ పెద్దలకు స్పష్టం చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ క్రమంలో హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందోనని అంతటా చర్చలు నడుస్తున్నాయ్.