ఆ ఏపీ బీజేపీ లేడీ లీడ‌ర్ అంత లైట్ అయిపోయారా..!

-

అర‌కు ఎంపీగా గ‌డిచిన ఐదేళ్ల‌లో చ‌క్రం తిప్పిన కొత్త‌ప‌ల్లి గీత‌కు ఇప్పుడు రాజ‌కీయంగా చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ఆమె అనుచ‌రులు. ఆర్డీవో ఉద్యోగి అయిన గీత 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చేరువై.. ఆ ఉద్యోగాన్ని మ‌ధ్య‌లో నే వ‌దిలేసి.. వైసీపీ త‌ర‌ఫున అర‌కు ఎంపీ టికెట్‌ను సొంతం చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అయితే, గెల‌వ‌క ముందు.. గెలిచిన త‌ర్వాత‌.. ఆమె వైఖ‌రిలో పూర్తిగా మార్పు క‌నిపించింది. క‌నీసం జ‌గ‌న్‌కు ఒక్క‌మాటైనా చెప్పకుండానే ఆమె గెలిచిన త‌ర్వాత పార్టీకి ఎడం పాటించింది. ఈ క్ర‌మంలోనే టీడీపీకి చేరువ అవ్వాల‌ని చూసినా.. ఆమె వైఖ‌రిపై చంద్ర‌బాబు ఫిర్యాదులు రావ‌డంతో దూరం పెట్టారు. టీడీపీలో చేర‌కుండానే ఆమె టీడీపీ పార్ల‌మెంట‌రీ ప‌క్ష స‌మావేశాల్లో పాల్గొన్నారు.

అటు టీడీపీ కూడా దూరం పెట్ట‌డంతో వైసీపీకి టీడీపీకి కూడా గీత స‌మాన దూరంలో ఉండిపోయారు. ఇక‌, కొన్నాళ్ల‌కు ఆమెపై కొన్ని కేసులు న‌మోదు కావ‌డం తెలిసిందే. ఆమె కులం విష‌యంలో కోర్టులో కేసులు న‌డిచాయి. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు సొంతంగా పార్టీ పెట్టుకుని తాను ఆ పార్టీ త‌ర‌ఫునే పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. ఈ యేడాది లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆమె విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఇక‌, ఎన్నిక‌లుముగిసిన త‌ర్వాత త‌న ప‌రిస్థితి రాజ‌కీయంగా ఇబ్బందిగా మారుతుంద‌ని గ్ర‌హించిన గీత తెలివిగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. త‌న పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అయితే, ఆమె ఆశించిన విధంగా పార్టీలో పెద్ద‌గా గుర్తింపు రాలేదు. దీంతో ఆ పార్టీకి కూడా ఇప్పుడు దూరంగా ఉంటున్నారు.

ఇటీవ‌ల 15 రోజుల పాటు బీజేపీ జాతీయ స్థాయి నాయ‌క‌త్వం పిలుపు మేర‌కు రాష్ట్రంలో సంక‌ల్ప యాత్ర‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి వ‌స్తుంద‌ని, పాల్గొంటుంద‌ని స్థానిక నాయ‌కులు భావించారు.
అయితే, గీత మాత్రం తాను గీసుకున్న గీత దాట‌లేదు. త‌న‌కు ఏదైనా ప‌ద‌వి ఇస్తే త‌ప్ప తాను వ‌చ్చేది లేద‌ని భీష్మించిన‌ట్టు బీజేపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రిగింది. దీంతో ఆమెను ఇప్పుడు ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం మానేసారు. పైగా త‌న‌కు బీజేపీ అధిష్టానం వ‌ద్దే ప‌లుకుబ‌డి ఉంద‌ని, రాష్ట్ర నాయ‌కుల‌తో త‌న‌కు పెద్ద‌గా సంబంధం లేద‌ని ఆమె త‌న అనుచ‌రుల వ‌ద్ద చెప్పుకొస్తుండ‌డం కూడా తీవ్ర వివాదానికి కార‌ణంగా మారింద‌నే మ‌రో ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

అయితే ఆమెను ఓ మాజీ ఎంపీగా కూడా బీజేపీ వాళ్లు గుర్తించే ప‌రిస్థితి లేదు. ఇక ఆమె డ‌బ్బాలు చూసి  రాష్ట్ర నేత‌లు ఎవ్వ‌రూ ఆమె పేరును కూడా ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు బీజేపీలో ఆమె ఉంటుందా?  లేక పాత గూటికి అంటే వైసీపీలోకి వ‌స్తుందా ?  వ‌స్తే. మాత్రం జ‌గ‌న్ రానిస్తారా ? అనే చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇదిలావుంటే, ఆమెపై హైద‌రాబాద్‌లో న‌మోదైన భూమి వ్య‌వ‌హారానికి సంబంధించిన అక్ర‌మాల కేసును తిరిగి తోడుటుండ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news