పొత్తులపై పవన్ బిగ్ ట్విస్ట్..బీజేపీ-టీడీపీల్లో కౌంటర్ ఎవరికి?

ఏపీలో పొత్తులపై మరొకసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలుమార్లు ఓట్లు చీలనివ్వను అని చెబుతున్న విషయం తెలిసిందే..అలాగే ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబు, పవన్ కలిసిన సంగతి తెలిసిందే. అలాగే గౌరవప్రదంగా ఉంటే పొత్తుకు రెడీ అని, లేదంటే ఒంటరిగా పోటీ చేయడానికి రెడీ అంటూ ఆ మధ్య శ్రీకాకుళం సభలో చెప్పుకొచ్చారు. అయితే పొత్తుకు ఇటు చంద్రబాబు గాని, అటు పవన్ గాని రెడీగానే ఉన్నారని తెలుస్తోంది. కాకపోతే ఎన్నికల సమయంలోనే పొత్తుల గురించి క్లారిటీ ఇస్తామని చెప్పుకొస్తున్నారు.

తాజాగా తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి గుడిలో వారాహి బస్సుకు పూజలు చేసిన పవన్..అక్కడ మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా వెళ్తామని, వారం రోజుల్లో ఎన్నికలు ఉంటే పొత్తులపై మాట్లాడొచ్చని,  కానీ ఇప్పుడు ఎన్నికలు లేవు కదా? అని అన్నారు. 2014 కాంబినేషన్ పునరావృతం పై కాలమే సమాధానం చెబుతుందని చెప్పుకొచ్చారు.

May be an image of ‎3 people, people standing and ‎text that says "‎الله‎"‎‎

అదే సమయంలో బి‌జే‌పితో పొత్తు నుంచి బయటకొస్తున్నారనే అంశంపై పవన్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో పొత్తు కొనసాగుతోందని, బీజేపీతో ఇప్పుడు కలిసే ఉన్నామని, ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా ముందుకెళ్తామని, లేదంటే ఒంటరిగా ఎన్నికలకు వెళ్తామని అన్నారు. అదే సమయంలో ఓట్లు చీలకూడదన్నదే తన అభిప్రాయమని, ప్రతిపక్షాలను అణిచివేయడానికే జీవో నెం.1 తీసుకొచ్చారని, వైసీపీకి విశ్వాసం సన్నగిల్లుతోందని, 175 సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని, నారా లోకేశ్‌, తన పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తే వారికి నమ్మకం లేనట్లే కదా? అని అన్నారు.

అయితే ప్రస్తుతం బి‌జే‌పితో పొత్తు ఉందని చెబుతూనే..ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా ముందుకెళ్తామని అన్నారు. అంటే ఇందులో బి‌జే‌పి కలిసొచ్చినా లేక టీడీపీ కలిసొచ్చినా అనేది క్లారిటీ లేదు. టి‌డి‌పి కలిస్తే బి‌జే‌పి కలవను అంటుంది..అప్పుడు పవన్..బి‌జే‌పిని వదిలేసి టి‌డి‌పితో వెళ్తారా? లేక టి‌డి‌పిని పక్కన పెట్టి బి‌జే‌పి‌తో వెళ్తారా? అనేది చూడాలి. మూడు పార్టీలు కలిస్తే ఇబ్బంది లేదు.