ఆంద్రప్రదేశ్ రాష్ర్టానికి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్. . .అవుననే అంటున్నారు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామజోగయ్య. ఒంటరిగా వెళ్ళినా,పొత్తులు పెట్టుకున్నా అతనే సీఎం అని తేల్చేశారాయన. దీనికి సంబంధించి సర్వే రిపోర్టును ఆయన బయటపెట్టారు. గోదావరి జిల్లాల్లో చేసిన సర్వేలో జనసేనకు మెజారిటీ స్థానాలు దక్కనున్నట్లు సర్వే ద్వారా తెలిసిందన్నారు. సీఎం అవుతానంటూ పవన్ చేస్తున్న ప్రకటన ప్రజల్లో జోష్ నింపిందని తన సర్వేలో ఆయన పేర్కొన్నారు.
సర్వేలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 500 శాంపిల్స్ సేకరించారు. కులాల వారీగా ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం జనసేనకు 80 శాతం మంది కాపులు సపోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది.అయితే ఈ సర్వేలో టీడీపీకి 8 శాతం,అధికార వైసీపీకి 12 శాతం కాపులు మద్ధతిస్తున్నట్లు వెల్లడైంది. బీసీలు 25 శాతం సపోర్ట్ చేస్తుండగా టీడీపీకి 40 శాతం మంది,వైసీపీకి 35 శాతం మంది మద్ధతిస్తున్నారు. ఎస్సీలు కూడా 26 శాతం మంది జనసేన వైపు ఉన్నారు. టీడీపి 14 శాతం,వైసీపీకి 60 శాతం మంది అండగా ఉన్నట్లు సర్వేలో హరిరామజోగయ్య పేర్కొన్నారు. జనసేన పథకాలను పూర్తిస్థాయిలో ప్రకటిస్తే వారాహి యాత్ర పూర్తయ్యే నాటికి మరింత సపోర్ట్ పెరిగే అవకాశ ఉందని జోగయ్య అంటున్నారు. పవన్ సీఎం అవుతాననే ప్రకటన ప్రజల్లో జోష్ నింపిందన్నారు.
సర్వే సంగతి ఎలా ఉన్నా. . . .ప్రస్తుతం పవన్‌ని జనసేన పార్టీలోని కార్యకర్తలే సరిగా నమ్మడం లేదని తెలుస్తోంది. కేవలం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదవడం, సాయంత్రానికి ప్యాకేజీ తీసుకుంటున్న పవన్ వ్యవహారాన్ని అభిమానులు ఇప్పటికే పూర్తిగా గ్రహించారు.వారాహి యాత్రలో సినిమా డైలాగులు చెప్తున్న పవన్‌ని అటు కాపు యువత కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.రోజురోజుకీ వారాహి యాత్రకు ప్రజల నుంచి స్పందన కూడా తగ్గిపోతోంది.ఈ క్రమంలో హరిరామజోగయ్య విడుదల చేసిన సర్వే రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.