ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడో బలమైన రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఆవిర్భవిస్తుందని అందరూ అనుకున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినా గాని పవన్ చరిష్మా చూసి చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు సైతం ఖచ్చితంగా పవన్ పార్టీకి భవిష్యత్తు ఉందని అప్పట్లో వ్యాఖ్యానించడం జరిగింది. అటువంటిది పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా బిజెపి పార్టీతో చేతులు కలపడంతో తన రాజకీయ జీవితాన్ని తానే డేంజర్ జోన్ లోకి పడేసుకున్నారు అని తాజా పరిస్థితుల బట్టి వ్యాఖ్యానిస్తున్నారు. 2019 ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే గట్టిగా అధికార పార్టీ వైసీపీ కి చెమటలు పట్టించింది పవన్ కళ్యాణ్.అలాంటిది జనసేన పార్టీ మంచి వేడి మీద ఉన్న టైంలో.. బీజేపీతో చేతులు కలపడం పవన్ కళ్యాణ్ చేసిన అతి పెద్ద మిస్టేక్ అని అంటున్నారు. అధికారంలో ఉన్న వైసీపీ చేస్తున్న ప్రతి పనికి మోడీ స్థాయి నుండి బిజెపిలో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇది ఓపెన్ సీక్రెట్. మూడు రాజధానుల విషయంలో గాని. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగించే విషయంలో గాని అన్ని పరిణామాలు చూస్తే బిజెపి ఆశీస్సులు జగన్ కి బలంగా ఉన్నట్టు అర్థమవుతుంది.
దీంతో ముందు పవన్ కళ్యాణ్ ని ఉమ్మడిగా పోరాటం చేద్దామని పార్టీలోకి తీసుకున్న బీజేపీ నేతలు, పిలిచి మరి పవన్ కే పొగ బెడుతున్నారని చాలామంది అంటున్నారు. అంతే కాకుండా బిజెపి పార్టీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని జనసేన పార్టీ కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు. బిజెపి పార్టీ తో పొత్తు పెట్టుకుని జగన్ ని ప్రతిపక్షంగా మంచి ఫైట్ ఇవ్వాలి అనుకున్న పవన్ కళ్యాణ్ తప్పటడుగు వేసి అట్టర్ ఫ్లాప్ అయిపోయారు అని అంటున్నారు.