జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో విడత వారాహి యాత్ర మొదలుపెట్టనున్నారు. ఈ నెల 9 నుంచి వారాహి యాత్ర మొదలవుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి యాత్ర మొదలవుతుంది. ఇక మొదట విడతలో వారై యాత్ర సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఉమ్మడి తూర్పు గోదావరిలో ప్రత్తిపాడు, పిఠాపురం, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ, రాజోలు నియోజకవర్గాల్లో పవన్ యాత్ర కొనసాగింది. ఇటు పశ్చిమలో నరసాపురం, భీమవరంలో పవన్ యాత్ర సాగింది.
అయితే మొదట విడత యాత్రలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, గ్రంథి శ్రీనివాస్ లాంటి కీలక నేతలని పవన్ టార్గెట్ చేశారు. ఇప్పుడు ఏలూరు నుంచి పవన్ యాత్ర మొదలవుతుంది. దీంతో పవన్ ఏ స్థాయిలో వైసీపీని టార్గెట్ చేస్తారు. స్థానిక వైసీపీ నేతలని టార్గెట్ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఏలూరు నుంచి మాజీ మంత్రి ఆళ్ళ నాని ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈయన గత ఎన్నికల్లో టిడిపిపై కేవలం 4 వేల ఓట్ల తేడాతో గెలిచారు. అక్కడ జనసేనకు 16 వేల ఓట్లు వచ్చాయి. అంటే జనసేన ఓట్లు చీల్చడం వల్లే గెలిచారు.
దీని తర్వాత పవన్ దెందులూరు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్లో యాత్ర చేయనున్నారు. అందులో ఇద్దరు మంత్రుల స్థానాలు ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ ఉండగా, తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. ఈ ఇద్దరు కూడా జనసేన ఓట్లు చీల్చడం వల్లే గెలిచారు. పైగా మంత్రులు అయ్యారు.
ఇప్పుడు వారే పవన్ ని గట్టిగా టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. ఇటు కొట్టు-పవన్ సామాజికవర్గం ఒక్కటే కావడంతో కొట్టు..మరింతగా పవన్ పై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు పవన్ ఏ విధంగా ముందుకెళ్తారనేది చూడాలి. మొత్తానికైతే పవన్ గాని..టిడిపితో కలిసి వెళితే ఆ మంత్రులకు ఓటమి తప్పదు.