ఏపీలో పోరాటం: పక్కకెళ్లి ఆడుకోవడమే.. ఒకముద్ద తిని పడుకోవడమే?

-

కొంతమంది ఉద్యమాలు సీరియస్ గా చేస్తారు.. ఎంచుకున్న అంశం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు.. ఎవ్వరినైనా కలుపుకుపోతారు.. ఎవ్వరితోనైనా పోరాడతారు.. మరెవ్వరినైనా ఎదురిస్తారు. ఇదే క్రమంలో మరికొందరు నాయకులు ఉంటారు… వారు ఇందుకు పూర్తిభిన్నంగా ప్రవర్తిస్తారు! వారిని నమ్ముకుంటే.. ఉధ్యమ లక్ష్యమూ నెరవేరదు.. ప్రజల బ్రతుకులకూ, భవిష్యత్తుకూ క్లారిటీ ఉండదు! కానీ… ఉద్యమం చాటున ఆ నాయకులకున్న రాజకీయ లక్ష్యాలు మాత్రం నెరవేరతాయి!

గతంలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి పొట్టిశ్రీరాములు చేసిన ఉద్యమం త్యాగాలకు, పట్టుదలకు ఉదాహరణ అయితే… సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఏపీ నాయకుల పోరాటం.. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా చేసిన పనులకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సమైక్యాంధ్రను కోరుకున్న ప్రజలను నాడు ఏపీ నాయకులు వంచించిన విధానం.. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అనే వారి ప్రవర్తన ఫలితం అందరికీ తెలిసిందే!

విభజన చట్టంలోని ఏ ఒక్కహామీ ఇప్పటివరకూ పూర్తిగా నెరవేరలేదు. ప్రత్యేక హోదా లేదు.. ఏమీ లేదు! సరికదా… ఇప్పుడు ప్రైవేటీకరణ తలనొప్పి కొత్తదొకటి మొదలైంది! అందులో భాగంగా మరోసారి బలైపోతున్నారు ఏపీవాసులు. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది… విశాఖ స్టీల్ ప్లాంట్!

విశాఖ స్టీలు ప్లాంట్ విషయంలో కూడా ఏపీ నాయకులు ఎవరూ సిన్సియర్ గా ప్రయత్నించడం లేదు.. నిజాయితీగా పోరాడటం లేదు! కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా అక్కడ ఉద్యమం కొనసాగుతుంది! విశాఖ కార్మికులు వారి స్థాయి మేరకు వారేదో పోరాడుతున్నారు. ఇందులో తాజాగా వైకాపా నాయకులు వచ్చి చేరారు! స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వ్యతిరేకిస్తూ తలపెట్టిన పాదయాత్రను మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రారంభించారు.

విచిత్రం ఏమిటంటే… ఈ ప్రైవేటీకరణ విషయంలో మోడీకి ఉన్న సీరియస్ నెస్ కీ… ఏపీలో జరుగుతున్న ఉధ్యమానికి ఎక్కడా పొంతన లేదు! మోడీని ఎదురించాలంటే… ఉద్యమం తీవ్రస్థాయిలో ఉండాలి.. ఏపీలో తొడకొడితే – రీసౌండ్ హస్తినవరకూ వినిపించాలి.. పార్లమెంటులో కుర్చీలు కదలాలి. 22మంది ఎంపీలు ఉభయసభలనూ నిలువరించగలగాలి.. విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి ఫలితం సాధించుకోవాలి. మరి ఆ స్థాయిపోరాటం ఏపీలో ఏది?

మోడీ మీదున్న భయంతో చంద్రబాబు బయటకు రారు… బీజేపీతో ఉన్న స్నేహంవల్ల పవన్ ప్రశ్నించరు. ఇక మిగిలింది అధికారపక్షం! వీరేమో విశాఖలో పాదయాత్రలు చేస్తున్నారు. ఆ పాదయాత్రలో కార్మికుల అడుగుల చప్పుడు హస్తిన వరకూ వినిపించదు – వారి పోరాటం కుర్చీలెక్కిన పెద్దలకు కనిపించదు! మరెలా.. ఆంధ్రుల హక్కు ప్రైవేటు పరం కాకుండా ఆగేది? వేలమంది కార్మికుల జీవితాలకు గ్యారెంటీ ఇవ్వగలిగేది? ప్రైవేటు బానిసత్వంలో ఆంధ్రుల హక్కు పడిపోకుండా ఆపగలిగేది?

సో… ఇలాంటి రాజకీయ స్వార్థప్రయోజనాలు పుష్కలంగా కలిగిన నాయకులు ఉన్నంతకాలం… ఏపీలో విశాఖ ఉక్కే కాదు – రేపొద్దున మరేదైనా కూడా ఇలానే పోతుంది. ఇంక చేయగలిగేదేముంది… పోరాటాల పేరున ఫోటోలకు ఫోజులిచ్చి, పక్కకెళ్లి ఆడుకోవడమే.. సాయంత్రం ఇంటికెళ్లి ఒకముద్ద తిని పడుకోవడమే!

Read more RELATED
Recommended to you

Latest news