వారంతా ఎన్నికల్లో ఆయన గెలుపుకోసం పనిచేశారు. అలాంటి వారు ఇప్పుడు ఆయన పేరు పలకడానికే ఇష్టపడటం లేదట. రాజకీయ భవిష్యత్ కోసం కారెక్కిన సింహానికి ఎందుకీ పరిస్థితి అనే చర్చ మొదలైంది. దీంతో ఆయన కొందరివాడా.. అందరివాడా అన్న కామెంట్సూ వినిపిస్తన్నాయి.
కోరుకంటి చందర్. రామగుండం ఎమ్మెల్యే. తెలంగాణ ఉద్యమకారుడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిటింగ్ శాసనసభ్యుడు సోమారపు సత్యనారాయణ తీరుతో విసుగు చెందిన టీఆర్ఎస్ నేతలు.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన చందర్‌కు పరోక్ష సహకారం అందించారు. దీంతో సింహం గుర్తుపై గెలిచిన చందర్ తర్వాత కారెక్కేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు చందర్.
ఇంత వరకు బాగానే ఉన్నా.. నాటి ఎన్నికల్లో చందర్ గెలుపుకోసం పనిచేసిన జడ్పీటీసీలతో ఎమ్మెల్యేకు అస్సలు పొసగడం లేదట. భవిష్యత్‌లో రాజకీయంగా తనకు ఇబ్బంది వస్తుందని అనుకుంటున్నారో ఏమో కానీ.. కొందరని ఎమ్మెల్యే పక్కన పెట్టేశారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం రూరల్ ప్రాంతంలో చందర్ కోసం ప్రచారం చేసిన పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి-పోచం దంపతులను పట్టించుకోవడం లేదట. రూరల్ ప్రాంతంలో ఎమ్మెల్యే పర్యటిస్తున్నా సంధ్యారాణికి చెప్పడం లేదని అంటున్నారు. దీంతో ప్రొటోకాల్ పాటించడం లేదని అధికార పార్టీ నాయకులు వీధికెక్కుతున్నారు.
వర్గాలుగా విడిపోయిన టీఆర్ఎస్ నాయకులు.. ఒకరి పేరు మరొకరు పలకడానికి కూడా ఇష్టపడటం లేదు. అలా పేరు ప్రస్తావించకుండానే దూషించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రచారాన్ని ఊదరగొడుతున్నారు. రామగుండం టీఆర్ఎస్లో ఈ వర్గపోరు తారాస్థాయికి చేరిందని అనుకుంటున్నాయి గులాబీ శ్రేణులు. పైగా మున్సిపల్ ఎన్నికల్లో తనకు అనుకూలమైన వర్గాలకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారంటూ రగడ జరిగింది. ఇప్పుడు పార్టీ నేతలను పక్కనపెట్టడం దుమారం రేపుతోందట. ఎమ్మెల్యే అనుచరులు మాత్రం అలాంటిదేమీ లేదని వివరణ ఇస్తున్నా.. నిప్పులేనిదే పొగరాదుగా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారట.
రామగుండం రాజకీయం మొత్తం తన కనుసన్నల్లోనే నడవాలన్నది ఎమ్మెల్యే ఆలోచనగా ఆయన్ని వ్యతిరేకిస్తున్న వారు విమర్శలు చేస్తున్నారు. అటు ఎమ్మెల్యే శిబిరం.. ఇటు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం అదను కోసం ఎదురు చూస్తోందట. ఏ మాత్రం చిన్న ఛాన్స్ లభించినా పగ తీర్చుకునేందుకు రెడీగా ఉన్నారట. మరి.. రామగుండం రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి.