జగన్ ఎన్నికల ప్రచారం రద్దుకు అసలు కారణం వేరే ఉందా

-

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల ప్రచారానికి సీఎం జగన్‌ వెళ్తున్నారన్న ప్రచారంతో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. జగన్ సభ పై అధికార,విపక్షాలు మాటల తూటలు పేల్చాయి. అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రచారం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. అయితే అనూహ్యంగా ప్రచారానికి వస్తానని ప్రకటించడం ఆ తర్వాత రద్దు చేసుకోవడం పై ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన వైసీపీ.. ఇప్పుడు తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై ఫోకస్‌ పెట్టింది. సిట్టింగ్‌ స్థానం కావడంతో మళ్లీ గెలుపు తమదే అన్న ధీమా అధికారపార్టీ నాయకుల్లో ఉంది. మెజారిటీ ఎంత అన్నదానిపైనే ఎక్కువగా చర్చ చేస్తున్నారు. ఇదే సమయంలో 14న తిరుపతి ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్‌ వెళ్తున్నారన్న ప్రచారం పొలిటికల్ టెంపరేచర్‌ను మరింత పెంచింది.

తిరుపతి బరిలో ఉన్న విపక్ష పార్టీలు వెంటనే జగన్ ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు మొదలుపెట్టాయి. గెలుపు అంత ఈజీ కాదని అర్థమయ్యే సీఎం జగన్‌ ప్రచారానికి వస్తున్నారని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వ్యంగ్యాస్త్రాలు సంధించాయి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో సీఎం జగన్‌ తాడేపల్లి గడప దాటకుండానే బంపర్ విక్టరీ కొట్టారు. ఈ స్థాయి విజయం వరించాక జగన్‌ ప్రచారానికి రావడం ఎందుకన్నది వైసీపీ నేతల్లో కొందరి అభిప్రాయంగా ఉంది. ఇదే సమయంలో మరో చర్చ సైతం పార్టీ వర్గాల్లో నడిచిందట.

గ్రేటర్ కార్పోరేషన్ లాంటి చిన్న ఎన్నికలకే కేంద్రమంత్రులు,బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రచారానికి రాగా తిరుపతి ప్రచారానికి వెళ్తే తప్పేంటని మరికొందరు వైసీపీ నేతలు ప్రచారాన్ని సమర్దించారట. స్వయంగా ప్రజల దగ్గరకు వెళ్లి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం మర్యాదగా ఉంటుందనే అభిప్రాయంతో సభను ఫిక్స్ చేశారంట..ఈలోపు జగన్ ప్రచారం పై విపక్షాల దాడితో రాంగ్ సిగ్నల్స్ వెళ్లడంతో ప్రచారం పై పునరాలోచనలో పడ్డారట. అందుకే తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల ఇంటింటికీ సీఎం జగన్ లేఖలు పంపారట.

ఇక కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండటం..ప్రచారంలో ఉన్న పలువురు టీడీపీ నేతలు కోవిడ్ ఇన్ ఫెక్షన్ భారీన పడటంతో ఇదే సాకుతో సభను రద్దు చేసుకున్నారు సీఎం జగన్. టీడీపీ అధినేత చంద్రబాబు,జనసేనాని పవన్ కళ్యాన్ మాత్రం తమ ప్రచారాన్ని కొనసాగించనున్నారు. మరో వైపు తెలంగాణలో ఉపఎన్నికల ప్రచారానికి మొదటిసారిగా సీఎం కేసీఆర్ వెళ్తున్నారు. లక్ష మందితో భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై విపక్షల నుంచి విమర్షలు పెద్ద ప్రచారంలోకి రాలేదు. కానీ జగన్ ప్రచారం పై మరో రకంగా ప్రచారం చేయడంతో కరోనా పేరుతో జగన్ ప్రచార సభ రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news