అధికార బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జాతీయ రాజకీయ పార్టీగా మారిన తరుణంలో స్థానికమైన అంశాలు పెద్దగా వార్తల్లోకి రావడం లేదు. కానీ స్థానికంగా పలు అంశాలు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ముప్పుగా ఉన్నాయని తెలుస్తోంది. సొంత నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నచోట పెద్ద రచ్చ జరుగుతుంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చిన ప్రతి స్థానంలోనూ రచ్చ ఉంది. ఇదే క్రమంలో పినపాకలో కూడా అదే రచ్చ జరుగుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రేగా కాంతరావు, బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లుపై గెలిచారు. ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన రేగా తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చారు. అక్కడ నుంచే పాయం, రేగా వర్గాల మధ్య రగడ జరుగుతోంది. నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కించుకోవడం కోసం ఇరువురు నాయకులు గట్టిగా ట్రై చేస్తున్నారు.
అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని ప్రకటించడం, జిల్లా అధ్యక్షుడుగా ఉండటం, పైగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీని దెబ్బకొట్టడంలో కలిసిరావడంలో రేగా పాత్ర ఉండటంతో..ఆయనకే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. రేగాకు సీటు ఖచ్చితంగా వస్తుందని ఆయన వర్గం కాన్ఫిడెన్స్ తో ఉంది. కానీ రేగాపై ప్రజా వ్యతిరేకత రావడం, ఆయనకు మళ్ళీ సీటు ఇవ్వరని తమకే సీటు ఇస్తారని పాయం వర్గం భావిస్తుంది.
ఇలా సీటు పోరులో రెండు వర్గాలు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో పాయం..టీడీపీ వైపు వెళ్తారని రేగా వర్గం ప్రచారం మొదలుపెట్టింది. టీడీపీలోకి వెళ్తారో లేక బీఆర్ఎస్ సీటు సాధిస్తారో..ఎవరి సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుందని పాయం వర్గం కౌంటర్లు ఇస్తుంది. పైగా పాయంకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మద్ధతు ఉంది. అయితే ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించారు. దీని వల్ల బీఆర్ఎస్ పార్టీకే నష్టం.