టీడీపీ పై ఆర్జీవీ ‘రామ’ బాణం ఎక్కుపెట్టింది ఇందుకే మరి !

సంచలన దర్శకుడు ఆర్జీవీ టీడీపీకి గురిపెట్టారు. ట్వీట్‌ చేసి టీడీపీలో సంచలనం రేపారు. ఒక్క సినిమాలే కాదు.. సమకాలీన అంశాలను.. ముఖ్యంగా రాజకీయాలను అప్పుడప్పుడు తనదైన శైలిలో కెలికి వదిలిపెడతారు. హఠాత్తుగా రూటు మార్చి తన ట్విట్స్ తో తెలుగుదేశంలో హీటెక్కించారు. టీడీపీ పై ఆర్జీవీ ‘రామ’ బాణం ఎక్కుపెట్టింది ఎందుకు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి‌రేపుతుంది.

రాంగోపాల్‌ వర్మ. పెద్దగా ఇంట్రడక్షన్‌ అక్కర్లేని డైరెక్టర్‌.ఇప్పటి వరకు జనసేనానిని తప్ప మరోపార్టీ గురించి పెద్దగా పట్టించుకున్న సందర్భాలు లేవు. ముఖ్యంగా జనసేనపైనా.. ఆ పార్టీ చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌పైనా ఓ రేంజ్‌లో ట్వీట్‌లతో వీలుచిక్కినప్పుడల్లా విరుచుకుపడుతూనే ఉంటారు. ప్రతిగా పవన్‌ ఫ్యాన్స్‌ కూడా ఆర్జీవీని ట్రోల్‌ చేస్తారు కూడా. సామాజిక మాధ్యమాల్లో వర్మ చేసే కామెంట్స్‌లో ప్రతి పదంలోనూ వెటకారం ఉంటుంది. సామాన్యులకు అది ట్వీట్‌గానే కనిపించినా.. అందులోని విషయం తగలాల్సిన వారికి నేరుగానే కాలుతుంది. ఇప్పుడు ఏమనుకున్నారో ఏమో.. టీడీపీపై రామబాణాలు వదిలారు. ట్వీటర్‌లో చంద్రబాబు, నారా లోకేష్‌, టీడీపీలను ఉద్దేశించి ఆయన పెట్టిన పోస్ట్‌లు సంచలనం రేపుతున్నాయి.

ప్రస్తుతం కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో టీడీపీపై తాను చేసిన కామెంట్స్‌కు వైరస్‌.. వేరియంట్‌.. వ్యాక్సిన్‌ వంటి పదాలను జోడించారు ఆర్జీవీ. లోకేష్‌ను వైరస్‌గా అభివర్ణించారు. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో చంద్రబాబును అదే కోవలో చేర్చారు. టీడీపీని ఈ వైరస్‌ నుంచి గట్టెక్కించాలంటే పార్టీ కేడర్‌కు ఉన్న ఒకే ఒక వ్యాక్సినే జూనియర్‌ ఎన్టీఆర్‌గా తేల్చేశారు రాంగోపాల్‌ వర్మ. ఇది తెలిసి చేశారో.. తెలిసి తెలియక చేశారో కానీ.. కామెంట్లు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ఆర్జీవీ అభిమానులు, టీడీపీ అభిమానులు పోటీపడి తమ అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తావన ఇటీవల ఎక్కువైంది. ఆ మధ్య చంద్రబాబు కుప్పం పర్యటనలో కేడర్‌ జూనియర్‌ రావాల్సిందేనని పార్టీ అధినేత ముందే నినాదాలు చేసిన పరిస్థితి. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం జూనియర్‌ ఎన్టీఆర్‌ రాకపై నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజులపాటు ఎన్టీఆర్‌ రాకపై పార్టీలో విస్తృత చర్చ జరిగింది. చంద్రబాబు, లోకేష్‌లు ఈ అంశంపై స్పందించకపోయినా.. చర్చ మాత్రం ఆగలేదు.

జూనియర్‌ ఎన్టీఆర్‌కు సైతం ఈ సెగ తప్పలేదు. రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఇది సమయం కాదు.. సందర్భం కాదు అని చాలా లౌక్యంగా జవాబు చెప్పి తప్పించుకున్నారు ఎన్టీఆర్‌. టీడీపీపై ఆర్జీవీ తన ట్వీట్లతో జూనియర్‌ ఎన్టీఆర్‌ను మరోసారి చర్చలోకి లాగారు. కాకపోతే లోకేష్‌ను వైరస్‌గా.. తారక్‌ వ్యాక్సిన్‌గా పోల్చడమే సంచలనంగా మారింది. రాజకీయాల్లో పవన్‌ను వదిలేశారో లేక టీడీపీని పట్టుకోవాలని అనుకున్నారో కానీ.. రామబాణాన్ని ఇటు ఎక్కుపెట్టి పొలిటికల్‌ సర్కిళ్లలో హీట్‌ పుట్టించారు వర్మ.