నారా లోకేశ్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సాధినేని యామిని.. ప‌రువు తీసేశారుగా..!

ఇటీవ‌ల టీడీపీకి గుడ్ బై చెప్పిన సాధినేని యామిని బీజేపీలో చేరారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. యామినిని కేంద్రమంత్రి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఆమె తాజాగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు బ‌య‌ట పెట్టారు. చంద్రబాబునాయుడు తనకు మంచి గౌరవాన్నే ఇచ్చారని, కానీ ఆ పార్టీలోని వ్యవస్థ మాత్రం తనను ఉండనివ్వలేదని చెప్పుకొచ్చారు. మరింత మంచిగా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే బీజేపీలో చేరానని యామిని వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడికి ఉన్నంత కమిట్ మెంట్ ఆయన కుమారుడు నారా లోకేశ్ కు లేదని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు బంధుత్వాలకు అతీతంగా వ్యవహరించలేక పోయారని, సెకండ్ జనరేషన్ నేతల్లో చంద్రబాబుకు ఉన్నంత కమిట్ మెంట్ లేదని అన్నారు. సెకండ్ జనరేషన్ నేతగా టీడీపీ ప్రమోట్ చేసిన నేతకు నాయకత్వ లక్షణాలు లేవని అన్నారు. తనకు ఆరేళ్ల క్రితం పూర్తి రాజకీయ పరిజ్ఞానం లేకపోయిందని వ్యాఖ్యానించిన యామిని, లోకేశ్ ఫాలోవర్లు తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాన్ని సృష్టించారని ఆరోపించారు. తన సొంత పార్టీ వాళ్లే, తనతో ప్రతిరోజూ మాట్లాడే వాళ్లు ఇలా చేయడం, దాన్ని తాను రుజువులతో సహా చూడటంతో, తన మనసు విరిగిపోయిందని వ్యాఖ్యానించారు. ఇంతకన్నా మరింతగా చెప్పడం సభ్యత కాదని భావిస్తున్నానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.