ముగిసిన సాగర్ ఎన్నికల సమరం..ఓటింగ్ ట్రెండ్ ని బట్టి ఫలితం ఇదే

-

తెలంగాణలో ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ముగిసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్‌శాతం కాస్త పెరిగింది. కరోనా భయాలు, ఎండను లెక్క చేయకుండా ఓటేశారు సాగర్‌ ప్రజలు.అధికార టీఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీలు హోరాహోరీగా తలపడ్దాయి. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని టీఆర్‌ఎస్‌ చెబుతుండగా..జానారెడ్డికి ఉన్న మంచిపేరు విజయాన్ని కట్టబెడుతుందని కాంగ్రెస్‌ లెక్కలేసుకుంటోంది. బీజేపీ కూడా తమదే విజయం అని గట్టి నమ్మకంతో ఉంది.

టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల అకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్‌ఎస్‌ నుంచి నోముల కుమారుడు భగత్‌ బరిలో ఉండగా..కాంగ్రెస్ నుంచి జానారెడ్డి పోటీ చేశారు. బీజేపీ నుంచి రవి కుమార్ నాయక్‌ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఐతే ఈ మూడు పార్టీల మధ్య మొదటి నుంచి గట్టి పోటీ ఉంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయ్‌. అయితే పోలింగ్ సరళిని బట్టి చూస్తే సాగర్ ప్రజల మనుసు గెలుచుకుంది ఎవరో కాస్త స్పష్టంగానే కనపడింది.

సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య నున్నానేనా అన్నట్లుగా పోరు సాగింది. గ్రామాల వారీగా, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ సరళిని పరిశీలిస్తే అధికార పార్టీకే కాస్త అనుకూలంగా పోలింగ్ జరిగినట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కారుకు కాస్త ఆధిక్యత కనిపించింది. కాంగ్రెస్ కాస్త పుంజుకున్నా పెన్షన్లు,రైతుబంధు,నగదు పంపిణి గట్టి ప్రభావం చూపాయి. పోల్ మేనేజ్ మెంట్ విషయంలో టీఆర్ఎస్ దే పై చేయి అయింది. గిరిజన ఓటు బ్యాంక్ పై గురిపెట్టి ఆ సామాజికవర్గానికి చెందిన అభ్యర్దిని బీజేపీ రంగంలోకి దింపిన ఆ ఓట్లు మూడు పార్టీలు షేర్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లుగా ఉన్న యాదవుల ఓట్లు అత్యధికంగా టీఆర్ఎస్ కే పోలయ్యాయి. రెడ్డి సామాజిక వర్గ ఓటర్లలో మెజార్టీ జానారెడ్డికే పడ్డాయని తెలుస్తుంది. దళిత సామాజిక వర్గ ఓట్లు కాంగ్రెస్, టీఆర్ఎస్ సమంగానే పంచుకునే అవకాశం కనిపిస్తుంది. రూరల్ ఓటింగ్ పై కాంగ్రెస్ ఆశలు పెట్టుకోగా అనూహ్యంగా పట్టణప్రాంతంలోనే హస్తం పార్టీకి అనుకూలంగా ఓటింగ్ జరిగినట్లు తెలుస్తుంది. మొత్తం మీద పోలింగ్ సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్ పై అధికార టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచినట్లు కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news