తిరుపతి ఫలితం తేడా కొడితే మొదటి వికెట్ ఆయనే

ఏపీలో జరిగి తిరుపతి ఉపఎన్నిక ఫలియం పై ఇప్పుడు ప్రధాన రాజకీయపార్టీలు దృష్టిపెట్టాయి.గెలుపోటములు,ఓట్ల లెక్కలతో కుస్తీ పడుతున్నాయి. వైసీపీ మెజార్టీ లెక్కలేస్తుండగా టీడీపీ గెలుపు పై నమ్మకంతో ఉంది. ఇక బీజేపీ,జనసేన కూటమి గెలుపుకోసం గట్టిగానే ప్రయత్నించింది. అయితే బీజేపీకి ఉన్న కాస్త బాలన్ని ఎక్కువగా అంచనా వేసి కేంద్ర నేతలను సైతం రంగంలోకి దింపారు సోము వీర్రాజు. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటంతో వీర్రాజుకి కొత్త టెన్షన్ పట్టుకుందట.


తిరుపతి ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ఏపీ బీజేపీ తెగ హడావిడి చేసింది. ముఖ్యనేతలంతా తిరుపతిలో మకాం వేసి ముమ్మరంగా ప్రచారం చేశారు. జనసేన-బీజేపీ కూటమి అభ్యర్దిగా రత్నప్రభని బరిలో దింపాయి. అయితే జనసేన నేతలతో బీజేపీ నేతలు సఖ్యత ప్రదర్శించినా కింది స్థాయిలో మాత్రం జనసేన ఓట్లు బీజేపీకి బదిలీకానట్లు తెలుస్తుంది. ఇదే ఇప్పుడు సోము వీర్రాజుని టెన్షన్ పెడుతుంది. గెలుపు సంగతి తర్వాత డిపాజిట్ దక్కుతుందా లేదా అని మదనపడుతున్నారట ఏపీ బీజేపీ నేతలు. కేంద్ర నాయకత్వానికి రాష్ట్రంలో పార్టీ వాపుని చూపించి బలమని నమ్మించే ప్రయత్నం చేశారనే చర్చ పార్టీ వర్గాలలో సాగుతోంది.

తిరుపతి ఉపఎన్నికల్లో అంతా తానై ముందుండి నడిపిన సోము వీర్రాజు ఎన్నికల బాధ్యతలు సమన్వయం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని సొంతపార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. పైగా పార్టీకి లేని బలం లేని చోట ఉన్నట్లుగా చూపించి తిరుపతిలో మనం గెలవబోతున్నామంటూ భాజపా జాతీయ నాయకులను నమ్మించి వారిని ఇక్కడ ప్రచారానికి రప్పించారని తెలుస్తోంది. బీజేపీ సభ అట్టర్ ప్లాప్ అవ్వడంతో అదే రోజు జేపీ నడ్డా వీర్రాజుకి గట్టి క్లాస్ పీకారు. ఇక్కడ మాతో ప్రచారం చేపించి మా పరువు తీస్తావా అంటూ ఘాటుగా స్పందించారట. మరో వైపు మొదటి నుండి సోము వీర్రాజుపై గుర్రుగా ఉన్న పార్టీలోని వ్యతిరేక వర్గంకు ఇప్పుడు మంచి అవకాశం దొరికినట్లైంది.

ఈ పరిణామాలన్ని గమనిస్తే తిరుపతి ఉపఎన్నికల ఫలితాల తర్వాత సోము వీర్రాజుకు మాత్రం పదవీగండం తప్పేలా లేదని పార్టీ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. బలం లేని చోట నానా హడావిడి చేసి పార్టీ నవ్వులపాలయ్యేలా చేశారా అని సెటైర్లేస్తున్నారు సొంతపార్టీ నేతలు.