వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో చాలామంది సీనియర్ నేతల వారసులు ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పలువురు సీనియర్లు తమతో పాటు తమ వారసులకు సీట్లు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అలా కుదరని పక్షంలో తమ వారసులకైనా సీటు వస్తే చాలు అని భావిస్తున్నారు. ఇదే క్రమంలో బిఆర్‌ఎస్ సీనియర్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..తనతో పాటు తన వారసుడుకు సీటు ఇప్పించుకోవాలని ఛుస్తున్నారు.
అయితే గత ఎన్నికల్లో ఇద్దరు పోటీ చేసిన విషయం తెలిసిందే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తలసాని సనత్ నగర్ నుంచి పోటీ చేసి గెలవగా, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తలసాని వారసుడు సాయి కిరణ్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అలా తలసాని వారసుడుకు ఫస్ట్ ఓటమి ఎదురైంది. కానీ ఈ సారి ఎలాగైనా గెలిపించుకోవాలని తలసాని ఛుస్తున్నారు. ఈ క్రమంలోనే తన సీటుని త్యాగం చేయాలని తలసాని భావిస్తున్నట్లు తెలిసింది.
ఈ సారి ఎన్నికల్లో తన వారసుడుని సనత్ నగర్ సీటులో నిలబెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. అక్కడైతే సాయికిరణ్ సులువుగా గెలుస్తారనే ధీమా తలసానికి ఉంది. అదే సమయంలో తాను కూడా మరొక సీటులో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. అది కూడా బిజేపికి పట్టున్న గోషామహల్ సీటులో ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారని తెలిసింది. అందుకే ఈ మధ్య ఎక్కువగా ఆ స్థానంపై ఫోకస్ పెట్టి..అక్కడ పర్యటించడం, అభివృద్ధి పనులు చేపట్టడం చేస్తున్నట్లు తెలిసింది.
అయితే బిజేపికి బాగా పట్టున్న గోషామహల్ లో గెలవడం అనేది చాలా కష్టమైన విషయం..నార్త్ ఓటర్ల ప్రభావం ఉన్న ఈ స్థానంలో రాజాసింగ్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. మరి అలాంటప్పుడు తలసాని రిస్క్ చేస్తారనేది చూడాలి. నెక్స్ట్ ఎన్నికల్లో తనతో పాటు తన వారసుడుకు సీటు దక్కించుకుంటారేమో చూడాలి.