తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయాలు అయ్యే వారికి 48 గంటల పాటు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. దీని కోసం ప్రత్యేకం గా పలు ప్రయివేటు, ప్రభుత్వ ఆస్పత్రిలను ఎంపిక చేశారు. ఆయా ఆస్పత్రిలలో రోడ్డు ప్రమాదంలో గాయాలు అయిన వారికి ఉచితంగా 48 గంటల పాటు వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించాడు.
దీని కోసం ఇన్నుయిర్ కాప్పోమ్ నమైకాక్కుమై – 48 అనే కొత్త పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారి ప్రాణాలను కాపాడే విధంగా ఈ పథకం ఉంటుందని అన్నారు. దాని కోసం 48 గంటల వరకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ పథకం కోసం 201 ప్రభుత్వ ఆస్పత్రులు, 408 ప్రయివేటు ఆస్పత్రులను మొత్తం 609 ఆస్పత్రులను ఎంపిక చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన వారు అయినా.. ఈ 609 ఆస్పత్రిలలో 48 గంటల పాటు ఉచిత వైద్యం అందిస్తారని తెలిపారు.