చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నలుగురితో చర్చించేవాడని, ఈ క్రమంలో చిరంజీవి కాస్త మెతకగా ఉండేవారని తమ్మారెడ్డి అన్నారు. అందువల్లే ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోయిందని అన్నారు.
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిగా రాజకీయాల్లోనే నిమగ్నమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఏపీలో ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటిస్తూ ఓ వైపు ప్రజా సమస్యలను తెలుసుకుంటూనే మరో వైపు పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున నిలబడే అభ్యర్థులను ఎంపిక చేయడంతోపాటు పార్టీ మ్యానిఫెస్టోను కూడా రూపొందించే పనిలో పవన్ నిమగ్నయ్యారు. అయితే రాజకీయాల్లో ఉన్నాక ఎంతటి వారిపైనైనా సరే విమర్శలు వస్తుంటాయి. అందుకు ఎవరూ అతీతం కాదు. అలాగే పవన్‌పై కూడా విమర్శలు చేసే వారున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారని, అదే సమయంలో ప్రజా సమస్యలపై అధికార పార్టీని నిలదీస్తున్నారని.. ఇది పార్టీకి శుభ పరిణామమని అన్నారు. అయితే గతంలో ఆయన అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో తలెత్తిన లోపాలను ఇప్పుడు పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీలో పునరావృతం కాకుండా చూసుకోవాలని తమ్మారెడ్డి అన్నారు.
గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నలుగురితో చర్చించేవాడని, ఈ క్రమంలో చిరంజీవి కాస్త మెతకగా ఉండేవారని తమ్మారెడ్డి అన్నారు. అందువల్లే ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోయిందని అన్నారు. అయితే పవన్ అందుకు భిన్నమని, అతను ఎప్పుడూ దుందుడుకుగా ఉంటాడని, ఆ వైఖరి రాజకీయాల్లో సరైందేనా అన్నది పవన్ నిర్ణయించుకోవాలని తమ్మారెడ్డి అన్నారు.
ప్రత్యేక హోదాపై అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటం ఉధృతం చేస్తున్నాయని, ఈ దశలో జనసేన కూడా ఆ అంశంపై దృష్టి సారించాలని తమ్మారెడ్డి అన్నారు. లేకపోతే ఎన్నికల్లో గెలవడం కష్టమన్నారు. ఇక గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నిర్వహించిన సభలకు జనం పెద్ద ఎత్తున వచ్చారని కానీ ఎవరూ ఓట్లు మాత్రం వేయలేదని, ఇప్పుడు అదే తరహాలో జనసేన పార్టీకి జరిగితే ఎన్నికల్లో గెలవలేరని, కనుక ఆ విషయంలో జాగ్రత్త పడాలని, సభలకు వచ్చే ప్రజల ఓట్లను తమకు వేసే విధంగా వారిని మార్చుకోవాల్సిన వ్యూహాన్ని పవన్ అమలు చేయాలని తమ్మారెడ్డి అన్నారు. లేదంటే ప్రజారాజ్యం పార్టీకి ఎదురైన పరిస్థితే జనసేనకు ఎదురవుతుందని తమ్మారెడ్డి హెచ్చరించారు.