టీడీపీ సీనియర్లకు చంద్రబాబు జలక్

-

తెలుగుదేశం పార్టీ సీనియర్లకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారిపై నీళ్లు చల్లారు. సీనియర్లను పక్కన పెడుతూ కొత్తవారికి క్యాబినెట్లో చోటిచ్చారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆశావాహులు ఎక్కువగా ఉండగా.. వారిలో కొంతమందికే అవకాశం ఇచ్చారు. ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒకరి చొప్పున మంత్రి పదవి కేటాయించారు. 25 జిల్లాల నుంచి మంత్రులు ఉండేలా చూసుకున్నారు. అయితే విశాఖ నగరం నుంచి ఒక్కరికి అవకాశం లేకపోవడం విశేషం.

 

సామాజిక సమతూకం, మిత్రులకు సర్దుబాటు చేయాల్సి రావడంతో సీనియర్లకు సర్దుబాటు చేయలేక పోయినట్లు తెలుస్తోంది. పార్టీకి చెందిన సీనియర్లు కళా వెంకట్రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, నందమూరి బాలకృష్ణ, పరిటాల సునీత, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, జీవి ఆంజనేయులు, జేసీ అస్మిత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , పల్లా శ్రీనివాసరావు తదితరులు మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు.

కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. టిడిపి సొంతంగా 135 చోట్ల గెలుపొందింది. దీంతో మంత్రి పదవుల కేటాయింపు కష్టతరంగా మారింది. 21 స్థానాల్లో గెలిచిన జనసేనకు మూడు మంత్రి పదవులు, ఎనిమిది స్థానాల్లో గెలిచిన బిజెపికి ఒక మంత్రి పదవి కేటాయించాల్సి వచ్చింది. ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవిని కేటాయించారు. అయితే చాలామంది సీనియర్లు మంత్రి పదవులు పై ఆశ పెట్టుకున్నారు. 2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పట్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అవకాశం దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. 2019లో రెండోసారి అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయమని ఆయనకు హామీ ఇచ్చారు. కానీ ఈ సారి పార్టీ అధికారంలోకి రాలేదు. ఈ సారైనా కేటాయిస్తారని ఆశించారు. కానీ అడియాశలు అయ్యాయి.

చాలామంది నేతలు తమకు ఇవే చివరి ఎన్నికలు అని చెప్పుకొచ్చారు. కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, జ్యోతుల నెహ్రూ వంటి వారు రిటైర్మెంట్ దిశగా అడుగులు వేశారు. చివరిగా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ చంద్రబాబు వారందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఈసారి ఎమ్మెల్యేలు భారీగా గెలిచినందున.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావించామని.. ముందుగానే ఎమ్మెల్యేలకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు దక్కకపోయినా.. పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దని స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఏకపక్ష విజయాన్ని దక్కించుకున్నందున.. సీనియర్లు బాహటంగా మాట్లాడే పరిస్థితి లేదు. అందుకే అసంతృప్తి ఉన్నా.. ఎవరు బయటపడటం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news