టార్గెట్ ఎన్టీఆర్: తమ్ముళ్ళు కొంపముంచుతున్నారుగా!

ఏపీ రాజకీయాలు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇటీవల రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ పేరు బాగా హైలైట్ అవుతుంది. ముఖ్యంగా టీడీపీ నేతలు ఎక్కువగా ఎన్టీఆర్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి వైసీపీ నేతలు.. అసభ్యంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఇక ఈ అంశంలో చంద్రబాబు కన్నీరు కూడా పెట్టుకున్నారు.

TDP Party | తెలుగుదేశం పార్టీ
TDP Party | తెలుగుదేశం పార్టీ

అయితే బాబు కన్నీరు పెట్టుకోవడంపై రాజకీయాలకు అతీతంగా ఇతర పార్టీ నేతలు, ఇతర రాష్ట్రాల నేతలు సైతం స్పందించారు. వైసీపీ వైఖరిని ఖండించారు. ఇదే క్రమంలో నందమూరి ఫ్యామిలీ సైతం.. వైసీపీ నేతలపై ఫైర్ అయింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ అంశంపై స్పందించారు. మహిళలని గౌరవించాలని చెబుతూనే, మహిళలని కించపరిచేలా మాట్లాడటం అరాచక పాలనకు నిదర్శనమని కామెంట్ చేశారు. కాకపోతే ఎవరి పేరు తీయకుండా ఎన్టీఆర్.. కర్ర విరగకూడదు… పాము చావుకూడదు అన్నట్లు మాట్లాడారు.

దీనిపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.. భువనేశ్వరికి మేనల్లుడుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫెయిలయ్యారని, ఆయన స్పందించిన తీరు టీడీపీ శ్రేణుల మనోభావాలను దెబ్బతీసిందని, సినిమాలు అందరికీ ఉంటాయని, కానీ బాలకృష్ణ ఎలా స్పందించారు? జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎలా స్పందించారు? కొడాలి, వల్లభనేని దొంగ బ్యాచ్‌ అని, ఇవన్నీ తన వ్యక్తిగత వ్యాఖ్యలు మాత్రమే అని, పార్టీకి సంబంధం లేదని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడారు. అదే కొడాలి, వంశీలు ఎన్టీఆర్ మాట వింటారని మాట్లాడారు.

అయితే కొడాలి నాని దీనిపై స్పందిస్తూ… ఎన్టీఆర్‌తో ఒకప్పుడు కలిసి ఉన్నామని, తర్వాత విభేదాలు వచ్చి విడిపోయామని, ఇప్పుడు ఆయన మాట ఎందుకు వింటామని అన్నారు. ఇక వర్ల వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో కొందరు టీడీపీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. ఎన్టీఆర్ ఏదొరకంగా స్పందించారని, దాన్ని పట్టుకుని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని, వర్ల లాంటి నేతల మాటల వల్ల పార్టీకే డ్యామేజ్ జరుగుతుందని, వెంటనే ఆయన చేత క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా కొందరు టీడీపీ నేతల వల్ల… చంద్రబాబుకే డ్యామేజ్ జరిగేలా ఉంది.