కుప్పంలో రివెంజ్ పాలిటిక్స్.. వైసీపీని ఖాళీ చేయడమే టార్గెట్

-

ఏపీలో రాజకీయాలు భలే విచిత్రంగా ఉంటాయి. ప్రతిపక్ష పార్టీని బలహీనపరచి అధికార పార్టీ మరింత బలంగా తయారవడం ఇక్కడే చూస్తాం. ఇప్పుడు కుప్పంలో అదే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం ఇది. 1989 నుంచి చంద్రబాబును తిరుగులేని నాయకుడిగా నిలబెట్టిన నియోజకవర్గం కూడా ఇదే. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు గెలిచినా, ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కుప్పంలో పట్టు కోసం చాలా ప్రయత్నాలు చేసింది.

tdp ysrcp

చంద్రబాబు భారీ మెజారిటీకి గండి కొట్టిన వైసీపీ ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పట్టు సాధించింది. కుప్పం మున్సిపాలిటీ తోపాటు అన్ని మండలాలపై పట్టు నిలుపుకుని వైసీపీ నేతల పెత్తనాన్ని తీసుకువచ్చారు ఆ పార్టీ నేతలు.అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి.మొన్నటి ఎన్నికల్లో అధికారం చేపట్టిన టీడీపీ ఇప్పుడు కుప్పంలో వైసీపీని ఖాళీ చేసి పనిలో పడింది.

రివెంజ్ పాలిటిక్స్‌కు వేదికైంది కుప్పం నియోజకవర్గం. ఓడిపోయిన తరువాత నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎక్కడా కనిపించడం లేదు.కొందరైతే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు తెరచాటు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీలోని వైసీపీ కౌన్సిలర్లు గంప గుత్తగా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.కుప్పం మునిసిపాలిటీలో 25 వార్డులు ఉండగా ఆరు వార్డులను టీడీపీ కౌన్సిలర్లు గెలిచి ఉన్నారు.మరో 19 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లు విజయం సాధించారు.కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ తోపాటు 11 మంది కౌన్సిలర్లు పసుపు కండువా కలుపుకునేందుకు హై కమాండ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.మిగతావారు కూడా సొంతంగా కూటమి లో చేరేందుకు సిద్ధమయ్యారు.

ఇక కుప్పం నియజకవర్గం పరిధిలోని మండలాల్లో కూడా ప్రజాప్రతినిధులు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం.ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆపరేషన్ జరుగుతోంది.కానీ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు, దాడులు, కేసులకు గురైన టీడీపీ నేతలు ఇప్పుడు వైసీపీ లీడర్స్ ఎంట్రీకి బ్రేకులు వేస్తున్నారు.

ఇక కుప్పంలో వైసీపీ నే కనిపించకుండా చేయాలంటే ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు నేతలకు గాలం వేసి తీరాల్సిందేనన్న ఆలోచన కూడా ఎమ్మెల్సీ శ్రీకాంత్ చేస్తున్నారు.ఇదే జరిగితే కుప్పంలో రివర్స్ గేమ్ తో వైసీపీ ఖాళీ కావడం తథ్యం అని విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news