తెలంగాణ బీజేపీ లీడర్ల మధ్య చిచ్చుపెట్టిన ఉప ఎన్నిక

-

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నిక తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టింది. ఏకగ్రీవం చేయడానికి సహకరించాలని కోరుతూ టీఆర్ఎస్ నేతలను కలవడంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ భగ్గుమన్నారు. టీఆర్‌ఎస్‌ అంటే రుసరుసలాడే కొందరు బీజేపీ నేతలు సైతం ఇది రుచించలేదని సమాచారం. అధికార పార్టీతో ఫైట్‌ చేస్తున్న సమయంలో టీఆర్‌ఎస్‌ నాయకులను కలిసి మాట్లాడటం వల్ల ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయని ప్రశ్నిస్తున్నారట. దీంతో ఉపఎన్నిక వివాదం పై బీజేపీ శిబిరంలో వాడీవేడీ చర్చ జరుగుతుంది.


తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అని చెబుతోంది బీజేపీలో ముఖ్యనేతల మధ్య కొంత కాలంగా పొసగడం లేదు. పార్టీ ముఖ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారట. వారి మధ్య ఆధిపత్యపోరు నడుస్తుందనే టాక్ బీజేపీలో ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓడిపోవడానికి నేతల మధ్య సమన్వయ లోపమే కారణమని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయట. లింగోజిగూడ నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి రమేష్‌గౌడ్‌ కార్పొరేటర్‌గా గెలిచినా.. ప్రమాణ స్వీకారం చేయకమునుపే కరోనాతో కన్నుమూశారు. అక్కడ ఉపఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ ఉపఎన్నికే బీజేపీ నేతల మధ్య విభేదాలను బయటపెట్టింది.

ఉపఎన్నికలో రమేష్‌గౌడ్‌ కుమారుడిని పోటీలో నిలబెట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. పోటీ లేకుండా రమేష్‌గౌడ్‌ కుమారుడిని ఏకగ్రీవంగా గెలిపించాలని స్థానిక బీజేపీ నేతలు డిసైడ్‌ అయ్యారు. హైదరాబాద్‌ సిటీ కార్యాలయంలో ఎల్బీ నగర్‌ నేతలతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ సమావేశమై చర్చించారు. ఆ సమావేశంలో లింగోజిగూడ డివిజన్‌లో పోటీ లేకుండా ఏకగ్రీవానికి సహకరించాలని కోరారు. బీజేపీ నేతలు చేసిన ప్రతిపాదనకు టీఆర్‌ఎస్‌ సానుకూలంగా స్పందించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని నిలపడం లేదని ప్రకటించింది. ఇదే అజెండాతో కాంగ్రెస్‌ నేతలను కూడా కలిసి విజ్ఞప్తి చేశారట బీజేపీ నాయకులు. వాళ్లు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది.

బీజేపీ బృందం వెళ్లి టీఆర్‌ఎస్‌ నేతలను కలవడం.. కేటీఆర్‌తో చర్చలు జరపడాన్ని బీజేపీలోని ఒక వర్గం జీర్ణించుకోలేక పోతుందట. ఇప్పటికే సీఎం కేసీఆర్ డిల్లీ వెళ్లి వచ్చాక బీజేపీలో దూకుడు తగ్గిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తాజా పరిణామాలు పార్టీ ఇమేజ్‌ను మరింత డ్యామేజ్‌ చేస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ నేతలకు ఫోన్‌ చేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఎలాగూ అక్కడ బీజేపీ గెలుస్తోంది. అలాంటప్పుడు వెళ్లి ఎందుకు కలిశారని బండి ప్రశ్నించారట. బీజేపీ అగ్రనాయకత్వాన్ని కేటీఆర్‌ విమర్శిస్తున్న సమయంలో ఆయనతో కలిసి మాట్లాడాలనే ఆలోచన ఎలా వచ్చిందని గుర్రుగా ఉన్నారట. ఈ రగడ బీజేపీలో ఇంకెలాంటి లుకలుకల్ని బయటపెడుతుందో అన్న చర్చ బీజేపీ కేడర్ లో నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news