రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కి కోపమొచ్చింది.ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన మైక్‌ని నేలకేసి కొట్టారు. ఆ రాష్ర్టంలోని బర్మర్ జిల్లా ఈ సంఘటనకు వేదికైంది. గెహ్లాట్ మైకు విసిరేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తన్న తీరుపై రివ్యూ నిర్వహించారు. ఇందులో ఈ సంఘటన చోటుచేసుకుంది.
పథకాల అమలు తీరును తెలుసుకునే క్రమంలో మహిళా లబ్దిదారులతో సీఎం ముఖాముఖి మాట్లాడారు.ఇందుకోసం గెహ్లాట్ మైక్ అందుకున్నారు. మాట్లాడుతుండగానే మైక్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు.తనకు ఎడమవైపున పక్కనే ఉన్న బర్మర్ జిల్లా కలెక్టర్ వైపు ‘ఏంటిది’ అన్నట్టుగా చూస్తూ ఆ మైక్‌ని విసిరేశారు. అక్కడే ఉన్న ఓ మహిళ మరో మైక్‌ని సీఎంకి అందించింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న సీఎం మైక్ తీసుకోకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. కలెక్టర్ పైకి గెహ్లాట్ మైక్ విసిరికొట్టారని జరుగుతున్న ప్రచారాన్ని ఆ తరువాత ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది.