తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార ప్రతిపక్ష పార్టీలు తమ బలబలాలను నిరూపించుకునేందుకు ప్రజల ముందుకు వెళుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీ అధినాయకత్వం కొన్ని నియోజకవర్గాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ ఖచ్చితంగా తమ పార్టీ గెలిచేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి నియోజకవర్గాలలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి.
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు. ఈయన రెండుసార్లు గెలిచి మూడోసారి హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ నుండి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. కెసిఆర్ మీద కోపంతో, బిఆర్ఎస్ లో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి కాంగ్రెస్ లోకి చేరిన నాగేశ్వరరావుకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. ఖచ్చితంగా గెలిచి తీరవలసిన ఎన్నికలు. అంతేకాకుండా తుమ్మల నాగేశ్వరరావు ఈసారి ఖమ్మం నుండి గెలిచి తన 40 ఏళ్ల రాజకీయ జీవితానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
ప్రచారంలో సైతం తాను నియోజకవర్గానికి సేవ చేయదలచి పోటీ చేస్తున్నానని, ఇవి ఆఖరి ఎన్నికలని అందుకే కచ్చితంగా తనను గెలిపించాలని ప్రజల ముందుకు వెళుతున్నారు. పువ్వాడ అజయ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు సవాళ్లు ప్రతి సవాళ్లతో ఖమ్మం రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు.
ఖమ్మం గ్రామీణ ప్రాంతాలలో 65% పైన ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పువ్వాడ అజయ్ భూ ఆక్రమణలకు పాల్పడ్డారని విమర్శలు కూడా ఉన్నాయి. రెండుసార్లు గెలిచిన అజయ్ పై ఉన్న వ్యతిరేకతతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలిసి తుమ్మల నాగేశ్వరరావు విజయాన్ని సునాయాసం చేస్తుందని చెప్పవచ్చు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు గెలుపును ఆపడం కష్టమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
మరి ఖమ్మం ప్రజలు ఎటు తమ ఓటు వేస్తారో వేచి చూడాల్సిందే.