వకీల్ సాబ్ సినిమా పవన్, టీడీపీని దగ్గర చేసిందా

-

తిరుపతి ఉప ఎన్నిక వేళ వ‌కీల్ సాబ్ సినిమా చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయ్. మూవీ ఎంత హిట్ అయ్యిందో తెలియ‌దు గాని ఎన్నిక‌ల్లో మాత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా ప్రత్యేక షోలకు అనుమ‌తుల‌పై ప్రభుత్వ విధానంతో ఈ అంశం మరింత హీటెక్కింది. దీనిపై బిజెపి-జ‌న‌సేన క‌స్సుమంటుండ‌గా వారికి టిడిపి కూడా వ‌త్తాసు ప‌లుకుతోంది. దీంతో ఏపీ రాజకీయాల్లో కొత్త రాజకీయబంధం పెనవేసుకోబోతుందా అన్న చర్చ మొదలైంది.

తిరుప‌తి ఉప ఎన్నిక‌ ప్రచారం జోరందుకుంది. బిజెపి, టిడిపి అగ్రనేత‌లు పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగిపోయారు. మ‌రోవైపు జ‌న‌సేనాని కూడా ఇప్పటికే ఒక ద‌ఫా ప్రచారం ముగించారు. విమ‌ర్శలు ప్రతివిమ‌ర్శల‌తో అధికార ప్రతిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డుస్తుంది. స‌వాళ్లు, ప్రమాణాలు అంటూ కొత్తకొత్త అంశాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఐతే ఇదిలా ఉండ‌గానే..ఇప్పుడు వ‌కీల్ సాబ్ సినిమా తెర‌పైకి వ‌చ్చింది. వ‌కీల్ సాబ్ సినిమాకు టిక్కెట్ల ధ‌ర, బెనిఫిట్ షో విష‌యంలో బిజ‌పి ఆరోప‌ణ‌లు చేస్తుండ‌గా..టిడిపి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.

ప‌వ‌న్ సినిమాకు ఇబ్బందులు అంటూ బిజెపి గ‌ట్టిగానే మాట్లాడుతోంది. ఆ ప్రభావాన్ని తిరుప‌తి బైపోల్స్‌లో ఓట్లుగా మ‌లుచుకునే ప్రయ‌త్నం చేస్తోంది. సినిమాను డిస్టర్బ్ చేస్తున్న వైసిపి ప్రభ‌ుత‌్వానికి పోలింగ్ రోజు ప్రజ‌లు బుద్ది చెపుతారంటూ విమ‌ర్శలు చేస్తోంది. ప‌వ‌న్ సినిమాను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వంపై తిరుప‌తిలో ప్రజ‌లు తిర‌గ‌బ‌డి ఓట్లు వేస్తార‌ని చెపుతోంది. ఐతే ఇదే విష‌యంలో ఇప్పుడు టిడిపి కూడా జ‌న‌సేనానికి మ‌ద్దతు ప‌లుకుతోంది. విష‌యం రాజ‌కీయ ప‌ర‌మైంది కాక‌పోయినా..ప‌రోక్ష మ‌ద్దతు తెలుపుతోంది.

ప‌వ‌న్ సినిమాల‌ను కూడా ఇబ్బంది పెట్టి ఏం సాదిస్తార‌ని టిడిపి ప్రశ్నిస్తోంది. త‌ద్వారా ప‌వ‌న్ అభిమానుల మ‌న‌సు గెలుచుకునే ప్రయ‌త్నం చేస్తోంది. స్థానిక ఎన్నికల సమయంలోనూ కొన్ని చోట్ల అవగాహనతో పోటి చేసిన టీడీపీ,జనసేన వచ్చే ఎన్నికలనాటికి దగ్గరవుతాయా అన్న చర్చ సైతం రెండు పార్టీల అభిమానుల్లో ఆసక్తి రేపుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ అంటే ఎందుకంత కక్ష జగన్ రెడ్డి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్నటి నెల్లూరు పర్యటనలో ప్రశ్నించారు.

మొత్తానికి తిరుపతి ఉప ఎన్నిక‌ స‌మయంలో వ‌చ్చిన ప‌వ‌న్ సినిమా క‌లెక్షన్లు, రేటింగ్ ప‌రిస్థితి ఎలా ఉన్నా రాజ‌కీయంగా మాత్రం మంచి చ‌ర్చనే తీసుకువ‌స్తుంది. ఐతే ఓటర్లపై వీటి ప్రభావం ఎంత‌ ఎవ‌రికి న‌ష్టం..ఎవ‌రికి లాభం అనేది మాత్రం అంతు చిక్కని అంశ‌మే.

Read more RELATED
Recommended to you

Latest news