ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం మొదలయ్యాయి. తొలిరోజే సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. సభల మొదటిరోజే పీపీఏలపై అధికార, ప్రతిపక్ష కమిటీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మరోవైపు, టీడీపీకి గుడ్ బై చెప్పిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అయితే ఆయన టీడీపీ బెంచీల వైపు వెనుక వరుసలో కూర్చున్నారు. టీడీపీకి రాజీనామా చేయడం.. ఇటు వైసీపీలో చేరకపోవడంతో.. అటు ఇటు కాకుండా టీడీపీ సభ్యులు కూర్చున్న వెనుకవైపు బెంచీలో కూర్చున్నారు.
టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై వంశీ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తన పొలిటికల్ కెరీర్ ప్రారంభం నుంచి టీడీపీలోనే కొనసాగిన వంశీ… చంద్రబాబుపై చేసిన విమర్శలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి. అంతేకాక.. తాను త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నానని.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితోనే తన పయనమని వంశీ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.