జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్న వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు ఈ సారి ఎన్నికల్లో సీటు దక్కేలా లేదు. ఇప్పటికే ఆయన పౌరసత్వంపై కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ అంశంపై తీర్పు వస్తే ఆయనపై వేటు పడి ఉపఎన్నిక వస్తుందని ఆ మధ్య ప్రచారం జరిగింది..కానీ కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఏదైతే ఏముంది గాని..ఈయన విదేశాల్లో ఎక్కువ ఉంటూ నియోజకవర్గంలో తక్కువ ఉండటం అనేది ఎక్కువైంది. ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు ఉన్నాయి.
దీంతో ఈ సారి ఆయనకు సీటు ఇస్తే గెలవడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వేములవాడ బిఆర్‌ఎస్ నుంచి కొత్త అభ్యర్ధి బరిలో ఉంటారని తెలిసింది. వాస్తవానికి 2009 నుంచి రమేష్ వేములవాడలో గెలుస్తూ వస్తున్నారు. 2009లో టిడిపి నుంచి గెలిచారు. తర్వాత బిఆర్‌ఎస్ లోకి వచ్చి 2010 ఉపఎన్నికలో గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. కేసిఆర్ వరుసగా ఆయనకు అవకాశం ఇస్తూ వచ్చారు. కానీ ఈ సారి అవకాశం లేదని, ఆయన్ని పక్కన్ పెట్టేస్తున్నారని బిఆర్‌ఎస్ అంతర్గత వర్గాల సమాచారం మేరకు తెలిసింది.
ఇక ఇక్కడ బిఆర్‌ఎస్ నుంచి చల్మెడ లక్ష్మీనరసింహరావుని నిలబెడతారని తెలిసింది. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన ఈయన 2009, 2014 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే సొంత పార్టీ వాళ్ళే తనపై కుట్రలు చేసి ఓడించారని, కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బిఆర్‌ఎస్ లో చేరారు. అప్పటినుంచి యాక్టివ్ గా పనిచేస్తున్నారు.
ఎలాగో కరీంనగర్ అసెంబ్లీలో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారు. అటు పార్లమెంట్ పరిధిలో వినోద్ ఉన్నారు. దీంతో చల్మెడని వేములవాడ బరిలో నిలబెడతారని తెలిసింది. ఇదిలా ఉంటే లక్ష్మీనర్సింహరావు తండ్రి చల్మెడ ఆనంద రావు ఎన్టీఆర్ హయాంలో న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. చల్మెడ లక్ష్మీనర్సింహరావు చల్మెడ ఆనందరావు వైద్యకళాశాల చైర్మన్ గా ఉన్నారు. కేటిఆర్ సన్నిహితుడుగ ఉన్న ఈయన వేములవాడ బరిలో పోటీ చేయడం ఖాయమని తెలుస్తుంది.