దళిత బంధుకు నిధులెక్కడివి..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉపఎన్నిక రానున్న విషయం తెల్సిందే. అయితే ఈ ఉపఎన్నిక ముందు రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేయాలని యోచనలో ఉండడంతో విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా ఇదే విషయమై బుధవారం సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ మహిళా నాయ‌కురాలు విజ‌య‌శాంతి స్పందించారు. హుజూరాబాద్‌లో దళిత బంధు పథకంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు… నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు అన్న చందంగా ఉన్నాయని విమర్శించారు.

ఎన్నికలలో గెలవాలంటే దళిత బంధు ప్రకటించాలి అని చెప్పడం ద్వారా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలవలేని పరిస్థితులు ఉన్నట్లు కేసీఆరే స్వయంగా ఒప్పుకున్నట్లు తెలుస్తుందని విజ‌య‌శాంతి పేర్కొన్నారు. అలానే గెలవలేని పార్టీలు హామీలు ఇవ్వగా లేనిది టీఆర్ఎస్ ఇస్తే తప్పేంది అన్నారని.. మరి గతంలో హుజూర్ నగర్, జీహెచ్ఎంసీ, నాగార్జున సాగర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఈ సందర్భంగా ప్రశ్నించారు. తెలంగాణ అంతా దళిత బంధు అమలు చేస్తానంటున్న ముఖ్యమంత్రికి ఈ పథకం కోసం నిధులు ఎక్కడి నుంచి కేటాయించునున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేసారు.