హేమాహేమీల్లాంటి టీడీపీ నేతలు సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారా

-

అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బ నుంచి పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి ఇలా‌ వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నా టీడీపీ సీనియర్లలో చలనం లేకుండా పోయింది. పార్టీకి కంచుకోట లాంటి పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీకి ఇప్పుడు ఇద్దరే ఎమ్మెల్యేలు. ఆ ఇద్దరిలో ఒకరే యాక్టివ్‌. మంత్రిగా చేసిన వారు సైతం సైలెంట్‌. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు కూడా అంతే. దీంతో పార్టీ ఖాళీ అయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. హేమాహేమీల్లాంటి టీడీపీ నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారన్నదానిపై సొంతపార్టీలోనే ఆసక్తికర చర్చ నడుస్తుంది.

పశ్చిమగోదావరి జిల్లా ఒకప్పుడు టీడీపీకి బలమైన జిల్లా. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి క్లీన్‌ స్వీప్‌ చేసింది. 2019 నాటికి పరిస్థితులు తారుమారు అయ్యాయి. జిల్లాలోని 15 స్థానాల్లో టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలే గెలిచారు. పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లోనే సైకిల్‌ నిలబడింది. దీనికితోడు రాష్ట్రంలో టీడీపీ పవర్ కోల్పోవడంతో ఆ ఎఫెక్ట్‌ జిల్లాపైనా కనిపించింది. అప్పట్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ఉండి కనుసైగతో జిల్లాను శాసించిన వారు ఒక్క ఓటమితో గప్‌చుప్‌ అయ్యారు. హేమాహేమీల్లాంటి టీడీపీ నాయకులు అనుకున్నవారు సైతం ఏమైపోయారో తెలియని పరిస్థితి. దీంతో జిల్లాలో తెలుగుదేశం ఖాళీ అయిపోయిందా చేవ చచ్చిందా అన్న అనుమానాలు కేడర్‌లో ఉన్నాయట.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం నడిపించే నాయకులు లేడన్నది పార్టీ వర్గాలు చెప్పేమాట. పంచాయతీలు పోయాయి. మున్సిపాలిటీలలో ఒకటి రెండు వార్డులకే పరిమితమైన దుస్థితి నెలకొంది. జిల్లా నుంచి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఉన్నారు. మరో మాజీ మంత్రి జవహర్‌ కొవ్వూరులో మళ్లీ కాస్త యాక్టివ్ అయ్యారు. ఇద్దరూ ఉన్నారంటే ఉన్నారు అంతే. యాక్టివ్‌గా లేరు. పార్టీ పదవులు అనుభవిస్తున్న వీళ్లు అసలు యాక్టివ్‌ పాలిటిక్స్‌లో ఉన్నారా అన్న అనుమానాలు కేడర్‌లో ఉన్నాయట. పాలకొల్లు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మల రామానాయుడు ఒంటరి పోరాటం చేస్తున్నారు. అది కూడా పాలకొల్లుకే పరిమితం. రాష్ట్రస్థాయిలో నిమ్మల పేరు వినిపిస్తున్నా.. జిల్లాలో మాత్రం అంత సీన్‌ లేదన్నది తమ్ముళ్ల మాట. మరో ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నా లేనట్టేనట. ఉండి నియోజకవర్గంలోనే ఆయన చప్పుడు చేయడం లేదు.

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌లో మునుపటి దూకుడు లేదు. కేసుల వల్ల భయపడ్డారో ఏమో సైలెంట్‌ అయిపోయారు. చింతమనేని పరిస్థితిని చూసిన జిల్లాలోని ఇతర టీడీపీ నేతలు మనకెందుకు వచ్చిన గొడవలే అని సర్దుకున్నట్టు చెబుతున్నారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మాగంటి బాబుల అలికిడి లేదు. 2004, 2009లో టీడీపీ అధికారంలో లేకపోయినా.. జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో అభ్యర్థులు దొరక్క విలవిల్లాడాల్సిన దుస్థితి ఎదురైంది. కొన్ని సందర్భాలలో క్షేత్రస్థాయి పరిస్థితులను అర్ధం చేసుకోకుండా నిరసనలకు పిలుపిస్తుండటంతో జనాల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారట నాయకులు. జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో పార్టీకి ఇంఛార్జులే లేరట. ఇది కూడా కేడర్‌ చెల్లాచెదురు కావడానికి ఒక కారణంగా అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news