జగన్ కేబినెట్ లో చోటుకోసం రేసు మొదలుపెట్టిన ఆ ముగ్గురు నేతలు

-

రాష్ట్రంలో వైసీపీ సర్కార్‌ ఏర్పాటై వచ్చే నెలతో రెండేళ్లు పూర్తి కాబోతుంది. ఆ తర్వాత ఆరునెలలకు మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు ఛాన్స్‌ ఉండటంతో కేబినెట్‌లో చోటుకోసం పావులు కదుపుతున్నారు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు. అధిష్ఠానం దృష్టిలో పడటమే లక్ష్యంగా రకరకాల ఫీట్లతో కేబినెట్ లో చోటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు . కేబినెట్ విస్తరణకు టైమ్ దగ్గరపడుతుండటంతో మంత్రి పదవి ఆశిస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టైమ్‌ను కీలకంగా భావిస్తున్నారట.రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పిన మాటను నమ్ముకుని.. ఆ సమయం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

రాష్ట్రంలో వైసీపీ సర్కార్‌ ఏర్పాటు కాగానే కృష్ణా జిల్లా నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రి అవుదామని ఆశించారు. ముగ్గురికి ఛాన్స్‌ ఇచ్చినా.. కొడాలి నాని, పేర్ని నాని,వెల్లంపల్లి శ్రీనివాసరావులకే ఆ అదృష్టం దక్కింది. మంత్రివర్గం ప్రమాణం సమయంలో సీఎం జగన్‌ చేసిన ప్రకటన ఆశావాహులకు కొంత ఊరట నిచ్చింది. జిల్లా నుంచి కేబినెట్‌లో ఉన్న కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి ప్లేసుల్లో కొత్తగా మరో ముగ్గురికి అవకాశం ఇస్తారా.. లేక ఇద్దరిని మార్చి కొత్త వారిని తీసుకుంటారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. కమ్మ సామాజికవర్గానికి చెందిన కొడాలి నానిని మంత్రిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయట. ఆ సామాజికవర్గం నుంచి పార్టీలో కీలక నేతగా కొడాలి ఉండటంతోపాటు.. టీడీపీ, చంద్రబాబులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండటం కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు.

జగ్గయ్యపేట నుంచి ఐదుసార్లు పోటీ చేసి మూడుసార్లు గెలుపొందిన విప్ సామినేని ఉదయభాను రేసులో ఉన్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఉదయభాను వైఎస్ ప్రధాన అనుచరుల్లో ఒకరు. మంత్రి పేర్ని నానిని రీప్లేస్‌ చేస్తే ఖచ్చితంగా అదే సామాజిక వర్గానికి చెందిన తనకు అవకాశం వస్తుందని సామినేని లెక్కలు వేసుకుంటున్నారట. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లిని మారుస్తారని చర్చ జరుగుతోంది. ఆలయాలపై దాడులు, దుర్గమ్మ గుడిలో అక్రమాలు ఆయన సీటుకు ఎసరుపెడతాయని అనుమానిస్తున్నారట. అదే జరిగితే విజయవాడ సిటీ నుంచి కేబినెట్‌లో తనకు పిలుపు వస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆశపడుతున్నారు. మూడుసార్లు పోటీచేసి రెండుసార్లు గెలిచిన మల్లాది తొలి మంత్రివర్గంలోనే చోటు ఆశించారు. ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్నారు. బెజవాడలాంటి నగరానికి మంత్రి అవసరం కాబట్టి తనకు అవకాశం వస్తుందని ఆయన భావిస్తున్నారట.

ఎమ్మెల్యే జోగి రమేష్‌ సైతం మంత్రి పదవిపై కన్నేశారు. కొడాలి తరహాలో మాజీ సీఈసీ నిమ్మగడ్డ, టీడీపీ, చంద్రబాబులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కూడా. వైసీపీ పెద్దల దృష్టిలో పడేందుకు ఉన్న ఏ ఛాన్సూను ఆయన వదులుకోవడం లేదట. అయితే బీసీ కోటాలో పదవి ఆశిస్తున్న జోగి రమేష్‌కు మాజీ మంత్రి పార్థసారథి రూపంలో పోటీ ఉందట. కేబినెట్‌ నుంచి ఎవరిని తొలగిస్తారో.. ఇంకెవరిని పిలుస్తారో స్పష్టత లేకపోయినా చర్చలు మాత్రం ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. కొడాలి నాని మాదిరే.. మంత్రి పేర్ని నానిని కేబినెట్‌ నుంచి కదపకపోవచ్చునని.. ఆయన పనితీరే రక్షణగా నిలుస్తుందని అనుకుంటున్నారట. మరి పార్టీ పెద్దల చూపు ఎవరిపై ఉంటుందో.. కేబినెట్‌ మార్పులు చేర్పుల సమయానికి ఎలాంటి సమీకరణాలు తెరపైకి వస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news