2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్ లపై భారీ చర్చ నడుస్తోంది. తాజాగా ఈవీఎమ్ మిషిన్లపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో జగన్ చేసిన ఈ ట్వీట్ అగ్గిరాజేస్తోంది. ఈవీఎమ్‌లు వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు అంటూ జగన్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని జగన్ గుర్తు చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత్‌లో కూడా ఈవిఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్లు వాడితే మంచిదరి జగన్ ట్వీట్ చేశారు.దేశ వ్యాప్తంగా ఇప్పుడు జగన్ ట్వీట్ గురించి చర్చ నడుస్తోంది.
జూన్4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత మీడియా ముందుకొచ్చిన జగన్.. ఫలితాలపై ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్పూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలని జగన్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
దీంతో ప్రస్తుతం జగన్ చేసిన ట్వీట్ కొత్త చర్చకు దారి తీసింది.అలాగే ఈవీఎమ్‌ల గురించి నాలుగు రోజుల క్రితం అమెరికాకు చెందిన వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈవీఎమ్‌లను హ్యాక్ చేయొచ్చని మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. దీంతో భారత్ లోని విపక్ష పార్టీలు కూడా ఎలన్ మస్క్‌కు మద్దతుగా మాట్లాడారు. ఈవిఎంలను మేనేజ్ చేయవచ్చనీ, అందుకే బ్యాలెట్ పద్ధతికి వెళ్లాలని రాహుల్‌గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి నేతలు వ్యాఖ్యానించారు. ఇప్పుడు జగన్ కూడా ఇదే బాటలో పేపర్ బ్యాలెట్‌కు జైకొట్టడం కొత్త చర్చకు దారితీసింది.
మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై అటు టీడీపీ నేతలు కౌంటర్లు విసురుతున్నారు.వైఎస్ జగన్ ఏపీ ఎలన్ మస్క్‌లా మాట్లాడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్ పెట్టాలని జగన్ చేసిన ట్వీట్‌పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా స్పందించారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని కౌంటర్ ట్వీట్ చేశారు. ఓడితే తన గొప్పని చెప్పే జగన్.. ఓడిపోతే మాత్రం ఈవీఎంల తప్పు అన్నట్టుగా మాట్లాడారని కౌంటర్ వేశారు. 2019ఎన్నికల్లో ఈవీఎంల గురించి తానేం మాట్లాడారో జగన్ గుర్తు చేసుకోవాలని సూచించారు సోమిరెడ్డి.